- తీరుమారకపోతే సిఎం ఇంటిని ముట్టడిస్తాం
- కుప్పం ఘటనపై అచ్చెన్నాయుడు హెచ్చరిక
అమరావతి: మీరు అసలు మనుషులేనా..పేదవాడికి పట్టెడన్నంపెట్టే అన్న క్యాంటీన్ ను అమానవీయంగా కూల్చేస్తారా.. మీ పతనానికి కుప్పం ఘటనే నాంది కాబోతోందని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కుప్పం ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకొని, టిడిపి కార్యకర్తలపై వేధింపులు ఆపకపోతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కుప్పంలో ప్రశాంత వాతావరణాన్ని నాశనం చేస్తున్న వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయి. ఒక ఫ్యాక్షనిస్టు, ఉన్మాది రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందో కుప్పంలో జరిగిన పరిణామాలు అద్దం పడుతున్నాయి. జగన్‌రెడ్డి అరాచకాలు పరాకాష్టకు చేరాయి. ఇటీవల జగన్‌రెడ్డి నిర్వహించిన వేర్వేరు సర్వేలలో 175 నియోజకవర్గాల్లో వైసీపీకి ఓటమి ఖాయమని తేలడంతో అన్కెతిక చర్యలకు పాల్పడుతున్నారు. జగన్‌రెడ్డి పాలనను అన్ని వర్గాల ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ప్రజా వ్యతిరేకతను దారిమళ్లించేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.
మూడున్నరేళ్లలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టకుండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు కూడా మూసేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు సేవ చేయాలి, ఆకలి తీర్చాలనే ఉద్దేశ్యంతో బాధ్యతాయుతంగా అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తుంటే వాటిని కూడా అడ్డు కోవడం దుర్మార్గం. కుప్పంలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న విషయం పోలీసులకు వారం రోజుల ముందే తెలియజేసినా భద్రతాపరమైన ఏర్పాట్లు తీసుకోకపోవడం దేనికి సంకేతం? ప్రతిపక్ష నేతకు సొంత నియోజకవర్గంలో పర్యటించే హక్కు లేదా? ఈ దాడి జగన్‌రెడ్డి ఆదేశాల మేరకే జరిగింది. వైసీపీ నేతలు సమావేశం నిర్వహించి మరీ కాన్వాయ్ మీద రాళ్లు వేస్తే రూ.50 వేలు, విధ్వంసం చేస్తే లక్ష రూపాయలు అంటూ నజరానాలు కూడా ప్రకటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. పట్టపగలు ప్రజలు రోడ్డు మీద తిరగలేని పరిస్థితి నెలకొందని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తంచేశారు. తెలుగుదేశంపార్టీ శ్రేణులు వైసీపీ నేతల బెదిరింపులకు భయపడరు. ప్రజల కోసం ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టంచేశారు.