- వైసిపినేతల పద్ధతి మారకపోతే తీవ్ర పరిణామాలు
- తప్పుడు పోలీసుల తీరును కూడా ఎండగడతాం
- ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడతాం చంద్రబాబు
కుప్పం: వైసిపి మూకల దాడిలో గాయపడిన టిడిపి కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం రాత్రి కుప్పం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి పరామర్శించారు. టిడిపి అధికార ప్రతినిధి, గంగమ్మగుడి మాజీ చైర్మన్ రవిచంద్ర, పోలీసుల దాడిలో గాయపడిన కార్యకర్త రాజులను పరామర్శించిన బాబు ఏవిధంగా వైసిపి మూకలు వారిపై దాడికి పాల్పడిరది అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడొద్దని, పార్టీ యావత్తు మీకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆసుపత్రిలో చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో వైసిపి ఉన్మాదం పరాకాష్టకు చేరుకుందని, వైసిపినేతలు హద్దులు మీరి ప్రవర్తించారన్నారు. పేదల ఆకలితీర్చేందుకు తాము అన్నా క్యాంటిన్ ఏర్పాటుచేస్తే మానవత్వం లేకుండా ప్రవర్తించారన్నారు. కొంతమంది రౌడీలు ప్రజాజీవితాన్ని స్థంభింపజేసే పరిస్థితికి వచ్చారు.. భయభ్రాంతులను చేస్తున్నారని అన్నారు. మహిళల ఇళ్లలోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వైసిపి నేతల తీరు చూస్తే బాధ, అసహ్యం వేస్తోంది. వారు ఇదే పోకడ కొనసాగిస్తే చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. ఇటువంటి పరిణామాలు నేను ఎప్పుడూ ఊహించలేదు.. కొందరు పోలీసులు మనసు చంపుకొని ఏమీచేయలేని నిస్సహాయ స్థితికి వచ్చారు. కొంతమంది రెచ్చి పోతున్నారు. వారిని హెచ్చరిస్తున్నా.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతుంటాయి. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులది. వైసిపి నేతలు రాష్ట్రాన్ని రావణాకాష్టం చేయడం దుర్మార్గం. నిన్న మూడు కేసులు మావారిపై పెట్టారు. మేమిచ్చిన కేసులు రిజిస్టర్ చేయలేదు. వైసిపి నేతల దుశ్చర్యలు, తప్పుడు పోలీసుల వ్యవహారశైలిని ఎండగట్టి ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడతామని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.