“మా తల్లి చదువుకోలేదు. కానీ నన్ను క్రమశిక్షణతో, ఒక స్ఫూర్తితో పెంచారు. మా తల్లి నన్ను పెంచే విషయంలో పడిన కష్టం చూసాను. నాడు మా అమ్మ కట్టెల పొయ్యితో వంట చేసి చాలా ఇబ్బందులు పడేది. మా అమ్మలా ఏ మహిళా కష్టపడకూడదు అని ఆరోజే ఆలోచన చేశాను. ఆ క్రమంలో వచ్చిందే దీపం పథకం” తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వినమ్రంగా చెబుతారు. చంద్రబాబు మస్తిష్కం లో నుంచి వచ్చిన ప్రతి ఆలోచనా, స్వీయ అనుభవం, కళ్ళారా చూసిన ప్రజల కష్టాల లోనుంచి ఉద్భవించినదే. చంద్రబాబు అందరిలా ఊకదంపుడు ఉపన్యాసాలు, బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెట్టే రాజకీయ నాయకుడు కాదు. ప్రజల కష్టాలు, కన్నీళ్లను తుడవటమే అజెండా గా ముందుకు సాగుతున్న నికార్సయిన పదహారణాల ప్రజానాయకుడు.
” మీ భార్యకు మీరు ఏదైనా బహుమానం ఇస్తున్నారా? అన్న ప్రశ్నకు ” నా భార్యే నాకు పెద్ద బహుమానం. ఆమెకు నేనేమి ఇవ్వగలను? అని భార్య గొప్పతనాన్ని సగర్వంగా చెప్పుకునే ధీశాలి. తన భార్య, పారిశ్రామిక వేత్తగా ఎదిగేందుకు అవకాశం కల్పించడం ద్వారా మహిళా సాధికారత ను తన ఇంటి నుంచే ఆచరణాత్మకంగా చూపిన ఆదర్శ నాయకుడు. మహిళా సాధికారత పై వివిధ రాజకీయ పార్టీలు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, తెలుగుదేశం పార్టీ మాత్రమే దానిని సాకారం చేసిందనటం లో సందేహం లేదు.
మహిళలకు ఆస్తిహక్కు, మహిళా విద్యకు ప్రోత్సాహం, మహిళలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ లు కల్పించటం ద్వారా తెలుగుదేశం పార్టీ సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఎంతో గౌరవం, ప్రాధాన్యత వుంటుంది. మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు మహిళల గొప్పతనాన్ని చాటి చెబుతూ, వారే తనకు స్ఫూర్తి ప్రదాతలుగా పేర్కొన్నారు. అదేసమయంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం పాదయాత్రలో మహిళామణులు కు పాదాభివందనం చేసి వారిపట్ల తనకున్న గౌరవభావాన్ని చాటుకున్నారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు వివిధ ప్రాంతాలలో వున్న మహిళలతో వర్చువల్ విధానంలో భేటీ అయ్యారు. దాదాపు వంద ప్రదేశాల నుంచి మహిళలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.