ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే ఉద్యోగులు, భావిభారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు డిమాండ్ ల సాధన కోసం చేసే పోరాటానికి టిడిపి అండగా నిలుస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం పెనుగొండ నియోజకవర్గం గుమ్మయ్యగారి పల్లె విడిది కేంద్రం వద్ద సిపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు లోకేష్ ను కలిసి సమస్యల గురించి విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
టిడిపి అధికారంలోకి రాగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులు పై కక్ష సాధింపు లు లేకుండా, వాటి విధులు స్వేచ్చగా నిర్వహించుకునే వాతావరణం కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు దే నన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేతనాలు సకాలంలో చెల్లించలేని దివాళాకోరు ప్రభుత్వం, వారికి రకరకాల సాకులతో వేధింపులకు గురిచేయటం దారుణమన్నారు.
పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పోలీసులను కాపలా పెట్టీ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని పేర్కొన్నారు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టిన నీచుడు జగన్ అని విమర్శించారు. టిడిపి అధికారంలోకి రాగానే ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ లు అన్నింటినీ పరిష్కరిస్తామని వెల్లడించారు.