రాష్ట్రంలో ఇసుక దోపిడీ పై జాతీయ హరిత ట్రిబ్యునల్ విధించిన జరిమానా సిఎం సొంత నిధుల నుంచి చెల్లించాలని టిడిపి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ప్రకృతి వనరులను కొల్లగొడతున్నారన్నారు. గుంటూరు లో టిడిపి నాయకుడు తాళ్ళ వెంకటేష్ యాదవ్ తో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కన్నా మాట్లాడారు. ఇసుక దోపిడీ అంతా సిఎం కనుసన్నల్లోనే జరుగుతున్నందున, వైసీపీ నాయకులే దానిపై కోర్టును ఆశ్రయించినట్లు తనకు సమాచారం వుందన్నారు.
జాతీయ హరిత ట్రిబ్యునల్ రీచ్ కు కోటి రూపాయల వంతున జరిమానా విధించింది అని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా సిఎం చేస్తున్న ఇసుక దోపిడీ కి ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజాధనాన్ని జరిమానా గా ఎందుకు చెల్లించాలి అని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు వెలువడిన అనంతరం కూడా ఏమాత్రం లెక్క చేయకుండా నదీ గర్భంలో యంత్రాలతో ఇసుకను బహిరంగంగా తరలిస్తున్నారని ఆరోపించారు. అందుకు సంబంధించిన ఫోటోలను మీడియాకు విడుదల చేశారు.
ప్రస్తుత సిఎం ప్రతిపక్షంలో వున్నప్పుడు చెప్పిన మాటలు అన్నీ మోసపూరితమేనన్న విషయం ఇప్పుడు స్పష్టమయింది అన్నారు. అధికారంలోకి రాగానే ఆరునెలల పాటు అసలు ఇసుక దొరకకుండా చేసి కృత్రిమ కొరత సృష్టించారని చెప్పారు. ఫలితంగా 50 లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. వారంతా ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోకుండా ఇసుక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేసి ప్రకృతి వనరులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.