టిడిపి అధికారంలోకి రాగానే చేనేత పై జీఎస్టీ రద్దుకు కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. అవసరమైన పక్షంలో ఆ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం పెనుకొండ నియోజకవర్గం సోమందేవపల్లి లో చేనేత, మరమగ్గాల కార్మికులు లోకేష్ ను కలిసి, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ టిడిపి అధికారంలోకి రాగానే చేనేత రంగాన్ని ఆదుకుంటుందని చెప్పారు.
చేనేత పై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ ఏ విధమైన కొర్రీలు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ముడిసరుకు కొనుగోలుకు రాయితీపై రుణాలు అందజేస్తామన్నారు. మరమగ్గాల కు 500 యూనిట్ లు, చేనేతలు 200 యూనిట్ లు ఉచిత విద్యుత్ అందజేయగలమని హామీ ఇచ్చారు. టిడిపి హయాంలో సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకునేందుకు రూ. 110 కోట్ల మేర చేనేత రుణాలను మాఫీ చేస్తామని, 50ఏళ్లకే పెన్షన్ ఇచ్చామని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం అనాలోచిత చర్యల కారణంగా చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకు పోయిందన్నారు.
గత నాలుగేళ్లుగా ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మికుల కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందించలేదని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సాయం అందించక పైగా వివిధ రకాలైన సాకులతో చేనేత కార్మికులకు రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నారని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి రాగానే అన్నివిధాల ఆదుకుంటామని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.