రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ధనాశతో క్యాష్ రెడ్డిగా పేరుగాంచారని, రూ.15 కోట్లు కప్పం కట్టకపోతే జాకీ పరిశ్రమని ఏర్పాటు చేయనివ్వనని బెదిరించడంతో ఆ కంపెనీ తరలిపోయిందని భూ నిర్వాసితులు, స్థానికులు లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్ర`క్యాష్` రెడ్డి డబ్బు పిచ్చి మా ప్రాంతీయులు ఆరువేలమందికి ఉపాధి దూరం చేసిందని వాపోయారు. యువగళం పాదయాత్రలో శుక్రవారం రాఫ్తాడు నియోజకవర్గంలోని ఎన్ఎస్ గేటు వద్ద నారా లోకేష్ ని జాకీ పరిశ్రమ భూ నిర్వాసితులు, మహిళలు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 2017 లో జాకీ కంపెనీని రాఫ్తాడు కు తీసుకొచ్చామని చెప్పారు. కంపెనీ కోసం 27 ఎకరాల భూమిని కేటాయించి, మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. జాకీ సంస్థ పనులు సైతం ప్రారంభించినట్టు తెలిపారు. 2019 లో రాష్ట్రంలోనూ, రాఫ్తాడులోనూ వైసీపీ రాబందులు అధికారంలోకి వచ్చి కమీషన్ ల కోసం జాకీ యాజమాన్యాన్ని వేధించటంతో రాష్ట్రాన్ని వదలి వెళ్లిపోయిందని ఆరోపించారు. డబ్బు పిచ్చితో జాకీని బెదిరించి తరిమేసి రాఫ్తదుకు తోపుదుర్తి ప్రక్యాష్ రెడ్డి తీరని ద్రోహం చేశాడని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమలు తీసుకువచ్చి అందరికీ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.