పిఠాపురంలో బీసీలకు టిడిపి ప్రభుత్వ హయాంలో కేటాయించిన కళ్యాణ మండపం స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. శనివారం పిఠాపురం పట్టణంలో టిడిపి కార్యాయలం నుండి కాకినాడ రోడ్డులోని గుట్ల వీధి వద్ద ఉన్న బీసీ కళ్యాణమండపం స్థలం వరకూ టిడిపి కార్యకర్తలు, బీసీ నాయకులతో కలిసి ఆయన మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీలకు కేటాయించిన స్థలంపై ఇప్పటి వరకూ జరిగిన మొత్తం వ్యవహారాన్ని వర్మ మీడియాకు వెల్లడిరచారు.
పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో ఆయన అనుచరులు గతంలోనే బీసీలకు కేటియించిన స్థలాన్ని కబ్జా చేసారని ఆరోపించారు. అప్పట్లో తాము అడ్డుకోవడంతో వెనుదిరిగారన్నారు. తాజాగా ఇప్పుడు అదే స్థలంలో ఆయన అనుచరులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. బీసీ, ఓసీ కళ్యాణ మండపాల విషయంలో ఏమాత్రం అన్యాయం జరిగినా ఊరుకునేది లేదన్నారు.
చంద్రబాబు హయాంలో అన్ని సామాజిక వర్గాలకు స్థలాలు కేటాయించారని, నిధులు వెచ్చించారని, కనీసం వాటిని ఖర్చు చేయడం మానేసి స్థలాలను లాక్కునే ప్రయత్నం చేయడం తగదన్నారు. నిరసన కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు రెడ్డెం భాస్కరావు, కొరుప్రోలు శ్రీను, నల్లా శ్రీను, కొండేపూడి ప్రకాష్, బర్ల అప్పారావు, పిల్లి చిన్న, కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కోళ్ల బంగారు బాబు పెద్ద సంఖ్యలో బీసీ, ఓసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.