తెలుగుదేశం పార్టీ నాయకులు విసిరే సవాళ్లు వైసీపీకి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన సెల్ఫీ ఛాలెంజ్ లు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి పనులను చూపుతూ విసురుతున్న సెల్ఫీ ఛాలెంజ్ లు తో అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అదే సమయంలో వివిధ నియోజకవర్గాలలో వైసీపీ నాయకులు చేస్తున్న అవినీతి, అక్రమాల పై ఎమ్మెల్యే లు, నియోజకవర్గ ఇంచార్జి లు దృష్టి సారించారు. వాటిపై చర్చించి నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ బహిరంగ చర్చకు రావాలని సవాళ్లు విసరసాగారు. వాటిపై వైసీపీ నాయకులు సరికొత్త నాటకానికి తెరదీసారు. తాముకూడ చర్చకు సిద్ధమని బింకం ప్రదర్శిస్తూ, మరోవైపు పోలీసులను ఉపయోగించి దానిని భగ్నం చేసి ప్రయత్నాలు చేస్తున్నారు.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాలలోని పలు నియోజకవర్గాలలో అక్కడి మంత్రులు, ఎమ్మెల్యే ల అవినీతి పై చర్చకు రావలసిందిగా సవాల్ విసిరారు. అదే క్రమంలో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం పైనా బహిరంగ చర్చకు ఆహ్వానించినా వైసీపీ నేతలు ఎవరూ అందుకు సాహసించలేదు. పుట్టపర్తి లో పల్లె రఘునాథరెడ్డి, తాడిపత్రి లో జేసీ ప్రభాకరరెడ్డి లు విసిరిన సవాళ్లు ఉద్రిక్తతలకు దారితీసాయి. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి వారిని చర్చలకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పుట్టపర్తి లో అయితే పోలీసులతో వైసీపీ శ్రేణులు కలిసి పోయి పల్లె రఘునాథరెడ్డి పై దౌర్జన్యానికి పాల్పడ్డాయి. రఘునాథరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో ఇదేవిధమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి లో టిడిపి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
పెదకూరపాడు నియోజకవర్గ టిడిపి ఇంచార్జీ కొమ్మాలపాటి శ్రీధర్, అక్కడి ఎమ్మెల్యే అవినీతిని బహిరంగంగా నిరూపిస్తానని సవాల్ విసిరినప్పటి నుంచే పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. అమరావతి లోకి ఎవరినీ ప్రవేశించ నీయకుండా జల్లెడ పట్టారు. అయినప్పటికీ కొమ్మాలపాటి వారి కళ్లుగప్పి అమరావతి చేరుకోగలిగారు. అయితే కొమ్మాలపాటి ని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కొమ్మాలపాటి అరెస్ట్ ను టిడిపి శ్రేణులు తీవ్రస్థాయిలో ప్రతిఘటించాయి. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని కార్యకర్తలు చెబుతున్నారు. కొమ్మాలపాటి చొక్కా సైతం చిరిగిపోయింది. ఒక బస్సులో కొమ్మాలపాటిని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టిడిపి శ్రేణులు ఆ వాహనానికి అడ్డుపడ్డాయి. వారందరినీ పక్కకు నెట్టివేసి కొమ్మాలపాటిని దాదాపు 7 గంటలపాటు వివిధ పోలీస్ స్టేషన్ లకు తిప్పి అనంతరం గుంటూరులోని ఆయన గృహం వద్ద విడిచి వెళ్లారు. ఈ సంఘటన టిడిపి శ్రేణులను దిగ్భ్రమకు గురిచేసింది.
ఒకవైపు సెల్ఫీ ఛాలెంజ్ కు, మరోవైపు బహిరంగ చర్చలకు సవాళ్లు నేపథ్యంలో వైసీపీ నాయకులు ఆత్మరక్షణలో పడ్డారు. టిడిపి నాయకులు విసిరే సవాళ్లకు వైసీపీ లో జవాబు చెప్పే వారే లేకుండా పోయారు. దానిని కప్పిపుచ్చుకునేందుకు పోలీసుల సహాయంతో టిడిపి నాయకులపై అధికార పార్టీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. చేసింది చెప్పుకునేందుకు మచ్చుకి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమం లేకపోవటం, అవినీతి, అక్రమాల విషయంలో సమర్థించుకునే అవకాశం లేకపోవటంతో వైసీపీ నాయకులు సవాళ్ళపై స్పందించలేని దయనీయ స్థితిలో ఉన్నారన్న వాదన వినిపిస్తోంది.