యువగళం పాదయాత్రలో భాగంగా డోన్ నియోజకవర్గం, ప్యాపిలి నియోజకవర్గం, ప్యాపిలి గ్రామానికి చెందిన చిన్న సుంకన్న తన మామిడి తోటలో ఉన్న ప్యాక్ హౌస్ వద్ద కూర్చుని ఉండగా, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ రైతును చూసి తన వద్దకు వెళ్లాడు. ప్యాక్ హౌస్ పై ఉన్న వివరాలు చూసి, దాని వల్ల జరుగుతున్న లాభాలు సదరు రైతును అడిగి తెలుసుకున్నారు. రైతు చిన్న సుంకన్న మాట్లాడుతూ 2014-15 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5ఎకరాల పైబడి ఉద్యాన పంటలు పండించే రైతులకు ప్యాక్ హౌస్ లను నిర్మించారు. మొత్తం హౌస్ విలువ రూ.4.10లక్షలు. దీనిలో రైతుకు రూ.2లక్షలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించింది. ఈ హౌస్ నిర్మించుకోవడం వల్ల కోసిన పంట ప్రకృతి విపత్తులకు గురై పాడవకుండా కాపాడుకుంటున్నాం.
గతంలో ఇవి లేనప్పుడు పంట మొత్తం పాడైపోయి విపరీతంగా నష్టపోయేవాళ్లం. 2018-19 సంవత్సరంలో నేను ఈప్యాక్ హౌస్ కట్టించుకున్నాను. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది. ప్యాక్ హౌస్ లేని ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానిపై నారా లోకేష్ స్పందిస్తూ చంద్రబాబుకు రైతులు ఎదుర్కొనే సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. కేంద్రం అందించే పథకాలకు, రాష్ట్ర నిధులను జత చేసి రైతులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్ మెంట్ ఆఫ్ హార్టికల్చర్(ఎం.ఐ.డీ.హెచ్.) పథకంలో భాగమే ఈ ప్యాక్ హౌస్ ల నిర్మాణం. ఉద్యాన రైతులకు 90శాతం సబ్సిడీతో డ్రిప్ ఇచ్చి చంద్రబాబు ప్రోత్సహించారు. ఎవరికైతే ప్యాక్ హౌస్ లు లేక ఇబ్బందులు పడుతున్నారో అటువంటి రైతులను మేం అధికారంలోకి వచ్చాక ఆదుకుంటాం. గతంలో నిర్మించిన విధంగా ఉద్యాన రైతులకు సబ్సిడీపై ప్యాక్ హౌస్ లు నిర్మిస్తాం. ఉద్యాన రైతులకు కావాల్సిన యంత్రాలు, యంత్ర పరికరాలు, వ్యవసాయ పనిముట్లను అందిస్తామని చెప్పారు.