పత్తికొండ నియోజకవర్గం శభాష్ పురం గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. శభాష్ పురం గ్రామంలో సాగు, తాగునీటి సమస్య అధికంగా ఉంది. వేసవిలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్, పైప్ లైన్, కుళాయిలు లేకపోవడంతో కిలోమీటరు దూరంలో ఉన్న పొలాల బోర్ల వద్దకువెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తోంది.
గత ప్రభుత్వంలో గ్రామంలో బోర్లు వేయించారు, పైప్ లైన్ వేసేలోపు ప్రభుత్వం మారిపోవడంతో పనులు నిలచిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వస్తోంది. పత్తికొండ, తుగ్గలిలో ఎటువంటి పరిశ్రమలు లేకపోవడంతో నిరుద్యోగులకు పొట్టచేతబట్టుకొని సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందిఅని వారు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీరు అందించే పథకానికి శ్రీకారం చుట్టాం. 30శాతం పనులు పూర్తయ్యాక ప్రభుత్వం మారిపోయింది. వైసిపి అధికారంలోకి వచ్చాక ఆ పథకానికి రాష్ట్రప్రభుత్వ వాటా నిధులు ఇవ్వకుండా పనులు ఆపేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ కుళాయి పథకాన్ని పూర్తిచేస్తాం. పత్తికొండ నియోజకవర్గంలో సోలార్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.