రాష్ట్ర రాజకీయాలలో మరో కొత్తపదం చేరింది. ఇప్పటివరకు అభివృద్ధి, సంక్షేమం, అవినీతి, అరాచకం, దౌర్జన్యం వంటి పదాలు మాత్రమే వినిపించేవి. ఇటీవలి కాలంలో తరచూ వినిపిస్తున్న మాట ‘ దమ్ము ‘. సాధారణంగా వీధి రౌడీలు, గూండాలు లేదా తెలిసీ తెలియని యుక్త వయసులో కొందరు యువకులు ఈ తరహా పదాలు వినియోగిస్తుంటారు. అయితే ప్రస్తుతం సాక్షాత్తు ప్రభుత్వం లో వున్న బాధ్యులు నోటి నుంచే ‘ దమ్ము ‘ అనే పదం తరచూ వెలువడుతుంది. దీంతో అసలు ఈ సమాజం ఎటు పోతోంది అన్న మీమాంస సామాన్యునిలో తలెత్తుతోంది. రాజకీయాలలో హుందాతనం, సంయమనం ఎంతో అవసరం. అధికారంలో ఉన్నవారిపై ఆ బాధ్యత మరింత ఎక్కువగా వుంటుంది.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా యర్రగొండపాలెంలో జరిగిన సంఘటన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలిపే హక్కు ఎవరికైనా వుంటుంది. అయితే నడిరోడ్డుపై సాక్షాత్తు ఒక మంత్రి చొక్కా విప్పి సవాల్ చేయటం దేనికి సంకేతం? అసలు ఎందుకు అలా చేశారన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. చంద్రబాబు పర్యటన నిలువరించటమే లక్ష్యమా? గతకొంతకాలంగా ఆ మంత్రి అభద్రతాభావం తో వున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత ప్రాపకం కోసం అలా చేశారా? అని భావించాల్సి వస్తుంది. ఏదేమైనా సాక్షాత్తు ఒక మంత్రి రోడ్డుపై చొక్కా విప్పి సవాల్ చేయటం, అందులోనూ సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న ప్రధాన ప్రతిపక్ష నేత పై సవాల్ చేయటం వెగటు పుట్టిస్తోంది. అంతేగాక అధికార పార్టీలో రోజురోజుకు ప్రబలుతున్న అసహనానికి ప్రతీకగా నిలిచింది. మంత్రే చొక్కా విప్పి సవాల్ చేయటంతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు భద్రతా దళం లోని ఒక అధికారికి రాయితగిలి గాయం అయింది. జెడ్ ప్లేస్ కేటగిరీ లో వున్న చంద్రబాబు చుట్టూ ఎన్ ఎస్ జి కమెండో కు రక్షణ కవచంగా నిలిచారు. తమ అధికారికి గాయం అయిన నేపథ్యంలో వారికున్న అధికారాలను వినియోగించి ఏదైనా నిర్ణయం తీసుకొని వుంటే పరిస్తితి చేయి దాటిపోయేది. భద్రతా సిబ్బంది ఎంతో సంయమనంతో వ్యవహరించటం ఎంతైనా అభినందనీయం.
అసలు నాయకులు చూపే ‘ దమ్ము ‘ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అభివృద్ధి, సంక్షేమాలను చూపి ఇదీ మా నాయకుడి దమ్ము. అని చెప్పవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని నాయకులు తమ దమ్ము ను ప్రదర్శించవచ్చు. రాష్ట్రానికి ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, విభజన హామీలు అమలు, మౌలిక సదుపాయాల కల్పన, శాంతిభద్రతల పరిరక్షణ వంటి వాటిలో అధికార పార్టీ నాయకులు ‘ దమ్ము ‘ చూపితే ప్రజలు సైతం హర్షిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి సందర్భాన్ని ఊహించటం అత్యాశే అవుతుంది.
టిడిపి అధినేత చంద్రబాబు తన హయాంలో లో చేపట్టిన కార్యక్రమాలను చూపుతూ ‘ ఇదీ నా దమ్ము ‘ అని ప్రజాక్షేత్రంలో బాహాటంగా ప్రదర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, యువగళం పాదయాత్రలో భాగంగా టిడిపి హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ముందు సెల్ఫీ లు దిగుతూ సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే మీరు కూడా ఇలా ఒక సెల్ఫీ దిగాలంటూ విసిరిన సవాళ్లకు ఈనాటి వరకు అధికార పార్టీ వైపు నుంచి జవాబు లేదు. అంతేగాక వంద కిలోమీటర్లు దూరం పాదయాత్ర పూర్తి చేసుకున్న ప్రతిసారీ ఒక నిర్మాణాత్మక హామీ ఇస్తున్నారు. తాను ఇచ్చిన హామీ కి గుర్తుగా ఆ ప్రాంతంలో శిలాఫలకం వేస్తున్నారు. వాస్తవానికి ఆ విధంగా చేయాలంటే ఎంతో దమ్ము వుండాలి. ఒక వైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్ లు వారి లోని ‘ దమ్ము ‘ ను ఈ తరహాలో ఆవిష్కరిస్తున్నారు. ఆ సవాళ్లకు జవాబు చెప్పలేక అధికార పార్టీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. అర్థంపర్థం లేని వాదనకు, అసభ్య పదజాలాలతో ఎదురు దాడులకు దిగుతూ వారిలోని అసహనాన్ని బహిర్గతం చేసుకుంటున్నారు.