టిడిపి అధికారంలోకి వచ్చాక కోసిగిలో డిగ్రీ కళాశాలను నిర్మిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం మంత్రాలయం నియోజకవర్గం కోసిగి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది.వేసవికాలంలో తాగునీటికి మేం పడే ఇబ్బందులు వర్ణనాతీతం. వ్యవసాయానికి సాగునీరు కూడా అందడం లేదు. కోసిగిలో డిగ్రీ కళాశాల నిర్మించండి. టిడిపి అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి అనివారు కోరారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రి జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యే దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదు. ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు పులికనుమ కెనాల్ నిర్మిస్తే, వైసిపి నేతలు ఆ నీటిని చేపలు, రొయ్యల చెరువులకోసం వాడుకుంటున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోసిగికి తాగు, సాగునీరందించేలా చర్యలు తీసుకుంటాం. కోసిగిలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి గతంలో జిఓ ఇస్తే, వైసిపి ప్రభుత్వం అమలుచేయలేదని లోకేష్ విమర్శించారు.