రాబోయేరోజుల్లో బిసిలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచేలా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం ఉమ్మడి కర్నూలు జిల్లా బిసి సంఘ ప్రతినిధులు యువనేత నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు .పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టసభల్లో బిసిలకు 50శాతం సీట్లు కేటాయించాలి. బిసిలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసేలా వత్తిడితేవాలి.
బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలుచేయాలి. ఇప్పటివరకు అసెంబ్లీ, పార్లమెంటు గడప తొక్కని బిసి కులాలకు ఆంగ్లో ఇండియన్ ప్రతినిధుల మాదిరిగా నామినేట్ చేయాలి. బిసిల సామాజికరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. కేంద్ర, రాష్ట్రాల్లో బిసిల జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాల్లో 56శాతం రిజర్వేషన్ కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కల్పించాలి.
జాతీయస్థాయిలో బిసిల అభివృద్దికి రూ.లక్షకోట్లతో సబ్ ప్లాన్ ఏర్పాటుచేయాలి. పాతపద్ధతిలో పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్, ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని అమలుచేయాలి. జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేయాలి. పంచాయితీరాజ్ సంస్థల్లో రిజర్వేషన్ ను 50శాతానికి పెంచి, చట్టబద్ధత కల్పించాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన గత నాలుగేళ్లలో రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారమళ్లించిన బిసిద్రోహి జగన్మోహన్ రెడ్డి. వైసిపి అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో అమలుచేసిన 100 సంక్షేమ పథకాలను రద్దుచేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా బిసిలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక బిసిలపై 26వేల తప్పుడు కేసులు నమోదు చేసి వేధించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం.
గత ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం. బిసిలకు చట్టసభల్లో అత్యధిక ప్రాధాన్యత నిచ్చిన పార్టీ తెలుగుదేశం, గతంలో ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు ఆర్థికమంత్రి వంటి కీలకపదవులను బిసిలకు కేటాయించాం. బిసిల సంక్షేమం కోసం పాటుపడే చంద్రన్నను ముఖ్యమంత్రి చేసేందుకు మీవంతు సహకారం అందించండి అని లోకేష్ విజ్ఞప్తి చేశారు.