టిడిపి అధికారంలోకి రాగానే ఇళ్లస్థలాలు లేని మున్సిపల్ కార్మికులందరికీ ఇళ్లస్థలాలు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం నంద్యాల టెక్కె మార్కెట్ యార్డు వద్ద సీఐటీయు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.
పీఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యాలు వర్తింపజేయాలి. మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. వారికి హెల్త్, రిస్క్ అలవెన్సులు వర్తింపజేయాలి. మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికులకు జీఓ-07 ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలి. ప్రతి కార్మికునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.
నంద్యాల మున్సిపాలిటీ లో అన్యాయంగా తొలగించిన 44మంది కార్మికులకు హైకోర్టు తీర్పు ప్రకారం 18నెలల వేతనాలు చెల్లించాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యోగి, కార్మికుడు ప్రశాంతంగా బతికే పరిస్థితులు లేవు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిబంధనలకు లోబడి న్యాయం చేస్తాం. పిఎఫ్, ఈఎస్ఐ, బీమా, హెల్డ్ కార్డుల వంటి సౌకర్యాలను వర్తింపజేస్తాం. నంద్యాల మున్సిపాలిటీలో అక్రమంగా తొలగించిన 44మంది కార్మికులకు హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు.