టిడిపి అధికారంలోకి వచ్చాక సత్యపాల్ కమిటీ ఆధారంగా వడ్డెర్లకు న్యాయం చేస్తాం. వడ్డెర్లకు చంద్రన్న బీమా పథకాన్ని అమలుచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం నంద్యాల నియోజకవర్గం జూలపల్లిలో వడ్డెర కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎపి విభాగం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏపీలో దాదాపు 40లక్షల మంది వడ్డెర కులస్తులు ఉన్నారు.
గనులు, భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా, ట్యాంకులు, బావులు, ఆనకట్టలు, రైల్వే వంతెనల నిర్మాణం, వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నారు. 1970వరకు వడ్డెరలు ఎస్టీలుగా ఉండేవారు. ఆ తర్వాత బీసీ-ఏ జాబితాలో చేర్చారు. అనంతరామన్ కమిషన్ వడ్డెర విద్యార్థులకు ఉచిత విద్యనందించాలని నివేదిక ఇస్తే దాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వడ్డెర విద్యార్థులకు ఉచిత విద్యనందించాలి. వడ్డెరలకు ప్రమాద బీమా కూడా లేదు. బీమా సౌకర్యం కల్పించాలి.
టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి. 45ఏళ్లు దాటిన వడ్డెరలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. వడ్డెర కార్పొరేషన్ కు నిధులు కేటాయించి ఆదుకోవాలి. వడ్డె ఓబన్న జయంతిని ప్రతియేటా అధికారికంగా నిర్వహించాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక వడ్డెర్లతో అన్ని కులవృత్తుల వారు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు.
వడ్డెర్ల ఉపాధికి ఎన్టీఆర్ హయాంలో క్వారీలు కేటాయిస్తే, జగన్ ప్రభుత్వం వచ్చాక కొందరు వైసిపి నేతలు ఆ క్వారీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో వడ్డెర్లకు ఆదరణ పథకం ద్వారా అధునాతన పనిముట్లు అందజేస్తాం. 2018లో మొట్టమొదటిగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పటుచేసి రూ.147 కోట్ల రూపాయలు కేటాయించాం. వైసిపి ఎటువంటి నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది. వడ్డె ఓబన్న జయంతిని ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం అని లోకేష్ హామీ ఇచ్చారు.