టిడిపి అధికారంలోకి వచ్చాక నిరుపయోగంగా ఉన్న గోస్పాడు ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తెస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం నంద్యాల నియోజకవర్గం గోస్పాడు గ్రామప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో 2015లో రూ.5.20కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఈ పథకం గత రెండేళ్లుగా నిరుపయోగంగా ఉంది. ఎత్తిపోతల పథకం కింద 600ఎకరాల పొలం సాగుబడిలో ఉంది. కానీ నేడు ఈ భూములు బీడుగా మారాయి.
అధికారులకు సమస్యలు వివరించినా పట్టించుకునేవారు లేరు. మీరు అధికారంలోకి వచ్చాక ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తెచ్చి సాగునీరు అందించాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. టిడిపి హయాంలో రైతులకోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ఎత్తిపోతల పథకాలను చేపడితే, వాటికి కరెంటు బిల్లులు, నిర్వహణ నిధులు ఇవ్వలేక పాడుబెడుతున్న అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
కర్నూలుజిల్లాలో దాదాపు 50వేలఎకరాలకు సాగునీరు అందించి గురురాఘవేంద్ర ప్రాజెక్టు అనుబంధ ఎత్తిపోతల పథకాలకు రూ.132 కోట్ల కరెంటు బిల్లులు బకాయి చెల్లించలేక మూలనబెట్టారు. దేశం మొత్తమ్మీద కరెంటు బిల్లులు కట్టలేక పథకాలను మూసేసిన దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటిలేదు అని లోకేష్ విమర్శించారు.