టిడిపి అధికారంలోకి వచ్చాక దామాషా పద్ధతిన యాదవ కార్పొరేషన్ కు నిధులు కేటాయించి బలోపేతం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా శుక్రవారం బనగానపల్లి నియోజకవర్గం కైప గ్రామంలో అఖిల భారత యాదవ మహాసంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
యాదవులకు జనాభా దామాషా ప్రకారం జిల్లాకు ఒక ఎమ్మెల్యే సీటు, రాష్ట్ర వ్యాప్తంగా 5 ఎంపీ సీట్లు ఇవ్వాలి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో యాదవులకు ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మన్ వంటి పదవులకు అవకాశం కల్పించాలి. ప్రతి నియోజకవర్గంలో యాదవ కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలి. యాదవ కార్పొరేషన్ కు రూ.1000 కోట్లు కేటాయించి ఆర్థిక తోడ్పాటునందించాలి.
పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రతి యాదవ కుటుంబానికి రూ.5లక్షల సబ్సిడీ లోన్ ఇవ్వాలి. టీటీడీ బోర్డు సభ్యుల్లో యాదవులకు ఒకరిని స్థానం కల్పించాలి. గొర్రెలు, పశువులకు బీమా వర్తింపజేయాలి. గొర్రెల కాపరులకు రూ.10లక్షలు బీమా ఏర్పాటు చేయాలి. నామినేటెడ్ పదవుల్లో యాదవులకు సముచిత స్థానం కల్పించాలి. యాదవులకు 50శాతం సబ్సిడీపై వాహనాలు మంజూరు చేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ 10శాతం తగ్గించడం ద్వారా బిసిలకు 16,800 పదవులు దక్కకుండా చేసిన బిసిల ద్రోహి జగన్ రెడ్డి. జగన్ అధికారంలో వచ్చాక బీసీ కార్పొరేషన్లకు విధులు, నిధులు లేకుండా నిర్వీర్యం చేశాడు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వాతంత్రాన్ని తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. యాదవులు ఆవులు, గొర్రెలు, ఆవులమేపుకునేందుకు ఖాళీగా ఉన్న బంజర్లు కేటాయిస్తాం. గొర్రెలు, ఆవులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.