టిడిపి అధికారంలోకి రాగానే అన్నిరకాల పంటలకు గిట్టుబటు ధర కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా శుక్రవారం మైదుకూరు నియోజకవర్గం విశ్వనాథపురం గ్రామ రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామ పొలాలకు కెసి కెనాల్ ద్వారా సాగునీరు అందుతోంది. వరి, పసుపు, శనగ పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నాం.
పసుపుపంట వేయడానికి ఎకరాకు రూ.1.30లక్షలు ఖర్చవుతోంది. అయితే గత కొంతకాలంగా పసుపుకు గిట్టుబాటు ధర రావడంలేదు. గతంలో క్వింటాలుకు రూ.8500 వరకు ధర లభించేది. వైసిపి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాక క్వింటాకు రూ.5,500 కి మించి ధర లభించడం లేదు. గత మూడేళ్లుగా పసుపు కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేదు. పంటను అమ్ముకోవడానికి మేము కడప, దుగ్గిరాల లేదా మహారాష్ట్రలోని శాంగ్లీ మార్కెట్ కు వెళ్లాల్సి వస్తోంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా ప్రాంతంలో శాశ్వత పసుపు మార్కెట్ ఏర్పాటుచేసి, మద్దతు ధర కల్పించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యవసాయరంగం పూర్తిగా నిర్వీర్యమైంది. ఎన్నికల సమయంలో రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానన్న ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావడం లేదు. జగన్ నిర్వాకం కారణంగా ఎపి రైతుల్లో అప్పుల్లో దేశం మొత్తమ్మీద మొదటిస్థానంలో ఉన్నారు. విశ్వనాథపురంలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేస్తాం. ఇక్కడ పంటనుబట్టి శాశ్వత మార్కెట్ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.