టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విజయవాడ, కడప హజ్ హౌస్ ల నిర్మాణాన్ని పూర్తిచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం కమలాపురం నియోజకవర్గం చెన్నూరు హజ్ హౌస్ వద్ద మండల మైనారిటీలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. చెన్నూరు గ్రామంలోని ఖిల్లా మసీదుకు టీడీపీ పాలనలో 12.55ఎకరాల స్థలం ఇచ్చారు.
ఆ భూమిని హజ్ హౌస్ నిర్మాణానికి కేటాయించి, రూ.28కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక హజ్ హౌస్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దానిలోని ఫర్నీచర్, ఫ్యాన్లు, బీరువాలు, ఫ్రిజ్ లను కూడా దొంగిలించారు. హజ్ హౌస్ ను పట్టించుకోకపోవడం వల్ల అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. హజ్ హౌస్ వద్ద పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు మొలిచి పందులు తిరిగే స్థితిలో ఉంది. నేటికీ హజ్ హౌస్ వద్ద ఎటువంటి ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించడం లేదు.
హజ్ హౌస్ కు సెక్యూరిటీ, స్టాఫ్ ఎవర్నీ ప్రభుత్వం నియమించలేదు. మీరు అధికారంలోకి వచ్చాక హజ్ హౌస్ నిర్మాణాన్ని పూర్తిచేయండి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మైనారిటీల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కరువైంది. వేలకోట్ల రూపాయల వక్ఫ్ ఆస్తులను వైసిపినేతలు విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. పవిత్రమైన ప్రార్థనా స్థలాలను కూడా వైసీపీ దొంగలు వదలడం లేదు.
పేద ముస్లింలను పూర్తి ప్రభుత్వ ఖర్చులపై హజ్ యాత్రకు పంపిస్తాం. మైనారిటీల ఆస్తుల సంరక్షణకు చర్యలు చేపడతాం. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నేతలు ఆక్రమించిన మైనారిటీల ఆస్తులను స్వాధీనం చేసుకొని తిరిగి వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.