టిడిపి అధికారంలోకి రాగానే గతంలో బ్రాహ్మణులకు అందజేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం కడప మాసియా సర్కిల్ లో బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేశారు.
బ్రాహ్మణ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రాహ్మణుల స్థితిగతులు రోజురోజుకు అధ్వానంగా తయారవుతున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ ను పునరుద్ధరించి, పథకాలు అమలు చేయాలి. బ్రాహ్మణులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. స్వయం ఉపాధి పథకాల ద్వారా బ్రాహ్మణ స్వయం ఉపాధికి సహకరించాలి. విదేశీవిద్య రుణాలు పునరుద్ధరించాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కులానికొక కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి అన్నివర్గాలను దారుణంగా మోసగించారు.
గత టిడిపి ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రూ.282 కోట్లతో 1,54,182 మంది బ్రాహ్మణులకు లబ్ధి చేకూర్చాం. వేదవ్యాస పథకం ద్వారా వేద విద్యాభ్యాసాన్ని ప్రోత్సహిస్తూ వేద విద్యాలయాలలో ఫుల్ టైం కోర్సు గా వేదాలు, స్మార్తం అభ్యసిస్తున్న పేద బ్రాహ్మణ విద్యార్థులకు రూ.21.60 లక్షల లబ్ది చేకూర్చడం జరిగింది. పురోహితులు, అర్చకులు, వేదపండితుల కుమార్తెలకు కళ్యాణమస్తు పథకం ద్వారా రూ.75 వేలను కానుకగా అందించాం.
గాయత్రి విద్యా పథకం ద్వారా, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల అనే విచక్షణ లేకుండా అత్యుత్తమ ప్రతిభ కనపరచిన 761 మంది విద్యార్ధులకు రూ.76 లక్షలను ప్రోత్సాహకంగా అందించాం. బ్రాహ్మణుల సంక్షేమం, స్వావలంబన కోసం రూ.50 కోట్లతో సీడ్ కాపిటల్ లో ప్రత్యేకంగా ఒక సహకార పరపతి సంఘం ఏర్పాటు చేశాం. పేద బ్రాహ్మణులకు ఇళ్లస్థలాలు, ఇళ్లు కేటాయిస్తాం. విదేశీవిద్య పథకాన్ని పునరుద్దరించి ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశం కల్పిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.