యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఒంగోలు నగరాన్ని హోరెత్తించింది. అడుగడుగునా జనం యువనేతకు హారతులు పడుతూ, దిష్టితీస్తూ నీరాజనాలు పట్టారు. 166వ రోజు యువగళం పాదయాత్ర ఒంగోలు శివారు పాలకేంద్రం వద్ద నుంచి ప్రారంభమైంది. జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జోరు వానను సైతం లెక్క చెయ్యకుండా మహిళలు, యువత, వృద్ధులు భారీగా రోడ్లపైకి తరలివచ్చి, యువనేతకు సంఘీభావం తెలిపారు. రోడ్లన్నీ జనంతో కిటకిటలాడటంతో ఇరువైపులా భవనాలపైకి ఎక్కి యునేతకు అభివాదం చేశారు.
ఒంగోలు మంగమూరు రోడ్డులో నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు. కిలోమీటరు పొడవునా ఎటూచూసినా జనమయంగా మారింది. అనంతరం అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఓపిగ్గా ఫోటోలు దిగుతూ యువనేత లోకేష్ ముందుకు సాగారు. యువనేతను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు వివిధవర్గాల ప్రజలు పోటీపడ్డారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగని రీతిలో యువనేతకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది.
వేలాదిమంది పసుపు సైన్యం నినాదాల నడుమ పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా భారీ గజమాలలు, సాంప్రదాయ నృత్యాలు, డిజె చప్పుళ్లు, కోలాట బృందాలతో ఒంగోలు నగరం మార్మోగింది. 166వరోజు యువనేత లోకేష్ 8 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2197.1 కి.మీ.ల మేర పూర్తయింది. యువగళంలో భాగంగా గురువారం ఒంగోలు శివార్లలోని రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట క్యాంప్ సైట్ లో జయహో బిసి సదస్సు నిర్వహించనున్నారు.