యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 168వరోజు ఒంగోలు, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉత్సాహంగా సాగింది. నారా లోకేష్ పాదయాత్ర ఈరోజు ఒంగోలు నియోజకవర్గం త్రోవగుంట వద్ద 2200 కి.మీ. మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా ఒంగోలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు హామీ ఇస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనివల్ల కొద్దిపాటి వర్షానికే తటాకంలా మారుతున్న ఒంగోలు నగరానికి జలదిగ్భందం నుంచి విముక్తి కలుగుతుంది.
పాదయాత్ర ప్రారంభానికి ముందు ఒంగోలు శివారు రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట క్యాంప్ సైట్ లో గ్రానైట్ పరిశ్రమదారులతో సమావేశమైన యువనేత వారి సాధకబాధలు తెలుసుకున్నారు. ఏడుగుండ్లపాడు వద్ద సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించగా, ఇన్ చార్జి బి.విజయకుమార్ నేతృత్వంలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఒంగోలు మంగమ్మకాలేజి సెంటర్, అగ్రికల్చరల్ మార్కెట్ యార్డు, త్రోవగుంట, సంతనూతలపాడు నియోజకవర్గం ఏడుగుండ్లపాడు, సీతారాంపురం కొష్టాలు, మద్దిపాడు, వెల్లంపల్లి మీదుగా గుండ్లాపల్లి శివారు విడిది కేంద్రానికి చేరుకున్నారు.
168వ రోజు యువనేత లోకేష్ 19 కి.మీ దూరం పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకు యువగళం పాదయాత్ర 2216.1 కి.మీ. పూర్తయింది. ఒంగోలు, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తయిన యువగళం శనివారం అద్దంకి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.