హైదరాబాద్ : సైబర్‌టవర్స్ నిర్మించి 25 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఐటీ రంగానికి బీజం వేసిన తెదేపా అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆదివారం నిర్వహించిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ సభపై నారా భువనేశ్వరి స్పందించారు. సైబరాబాద్‌లో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ అందరి మనసులను తాకింది. ఒక నేత పాలనలో, పాలసీలతో లబ్ధి పొందిన వర్గాలు ఇలా కృతజ్ఞత తెలిపేందుకు వేలాదిగా తరలిరావడం నేటి రాజకీయాల్లో అత్యంత అరుదైన విషయం. ఒక నాయకుడిగా చంద్రబాబుకు ఇంతకంటే ఇంకేం కావాలి? దీన్ని మించిన తృప్తి ఇంకేముంటుంది? ఎవరినైనా అరెస్టు చేస్తే వారి అక్రమాలు బయటకు వస్తాయి. కానీ, చంద్రబాబును అరెస్టు చేస్తే ఆయన చేసిన అద్భుతాలు బయటకు వచ్చాయి. కొందరు ఆయనను జైలులో పెట్టామని ఆనంద పడుతున్నారు. కానీ, ఆయన కోట్ల మంది హృదయాల్లో ఉన్నారు. వెలకట్టలేని మీ కృతజ్ఞతకు అభివందనాలు అని భువనేశ్వరి ట్వీట్ చేశారు.