అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. 161, 91 సెక్షన్‌ల కింద తనకు నోటీసులు ఇవ్వడాన్ని కిలారు రాజేష్ హైకోర్టులో సవాల్ చేశారు. తనకు నోటీసులు ఇచ్చి విచారణలో బెదిరించిన వైనాన్ని పిటిషన్‌లో రాజేష్ వివరించారు. తనకు నోటీసులు ఇవ్వటం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. రాజేష్ తరపున హైకోర్ట్‌లో సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించగా, రాజేష్ తరపున ఆదినారాయణ రావు వాదనలు వినిపిస్తూ ఎల్‌ఓసీ (లుక్ అవుట్ సర్క్యులర్) లో రాజేష్‌ను నిందితుడిగా చూపించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మళ్లీ 161, 91 కింద నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రాజేష్‌ను వెంబడిరచిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి న్యాయవాది తీసుకువచ్చారు.
అప్పుడు గతుక్కుమన్న సీఐడీ న్యాయవాది తాము ఎల్‌ఓసీ పొరపాటున ఇచ్చామని చెప్పుకొచ్చారు. తాము రాజేష్‌ను నిందితుడిగా పేర్కొనలేదని చెప్పారు. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టుల ఈనెల 17కు వాయిదా వేసింది.
సీఐడీ వ్యవహారశైలి చూస్తూంటే..చట్టంతో చెలగాటం అడుతున్నారని ఎవరికైనా అర్థమైపోతుంది. ఆధారాల్లేని కేసులు పెట్టడం.. అడ్డగోలుగా అరెస్టులు చేయడం.. టార్గెట్ గా పెట్టుకున్న వారిని ఎలాగోలా కొన్నాళ్లు జైల్లో ఉంచడం అన్నట్లుగా సాగిపోతోంది. తెలంగాణ హైకోర్టులో కూడా ఇలా మార్గదర్శి ఎండీ మీద తప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేసి చీవాట్లు తిన్నది.
రాజేష్‌పై రెక్కీ చేసింది ఏపీ పోలీసులేనా..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో గతంలో సీఐడీ ఎదుట కిలారు రాజేష్ హజరయ్యారు. సీఐడీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆయన హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారని ఏపీ సీఐడీకి తెలుసు. కనుక విచారణకు హాజరవ్వాలని కోరుతూ నోటీసులు ఇవ్వాలన్నా, అరెస్ట్ చేయాలన్నా ఎటువంటి ఇబ్బందీ లేదు. చట్ట ప్రకారం చేయవచ్చు. కానీ అలా చేయకుండా మూడు రోజుల క్రితం ఆయన తన కుమార్తెను స్కూలు నుంచి తీసుకువచ్చేందుకు బయలుదేరినప్పుడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనాన్ని వెంబడిరచారు. వారు వైసీపీకి చెందిన వ్యక్తులని అనుమానించిన రాజేష్ వారిని, వారి వాహనాలను నంబర్లతో సహా ఫోటోలు తీసి, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సమర్పించి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు సెక్షన్స్ 341,506 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వారు సంచరించిన ప్రాంతాలలోని సీసీ కెమెరా రికార్డింగులు, రాజేష్ సమర్పించిన వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేసి వారు ఏపీ ఇంటలిజన్స్ విభాగంలో కౌంటర్ ఇంటలిజన్స్ పోలీసులై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వారిలో ఒకరు హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులని అనుమానిస్తున్నారు. వారు సివిల్ దుస్తులు ధరించి కిలారి రాజేష్‌ని వెంబడిరచిన్నట్లు భావిస్తున్నారు. వారిలో ఒక వ్యక్తి వాహనానికి ఉన్న నంబర్ ప్లేట్ నకిలీదని జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు.
కౌంటర్ ఇంటలిజెన్స్ పూర్తిగా ఉగ్రవాద నిరోధక విభాగం. అందు కోసమే పని చేయాలి. కానీ రాజకీయ నేతలపై నిఘా కోసం ఆ విభాగాన్ని వాడుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అసాంఘిక శక్తులుగా మారి .. రెక్కీ నిర్వహించడం.. సంచలనంగా మారుతోంది. కిలారు రాజేష్ ను గురి పెట్టి భారీ కుట్ర చేస్తున్నారని, ఇందులో పోలీసులు భాగం అవుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల ద్వారా రాజేష్ కుటుంబానికి హాని కలిగించే కుట్రను పెద్ద ఎత్తున చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ పోలీసుల వ్యవహరశైలి పూర్తిగా దారి తప్పింది. రాజకీయ కుట్రలకే కాదు, భౌతిక దాడులకు.. రాజకీయ ప్రత్యర్థుల హత్యలకూ వారు పావుగా మారుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు అవి మరింత ఎక్కువగా బలపడుతున్నాయి.