హైదరాబాద్: యశోదా ఆసుపత్రిలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం పరామ ర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కే.చంద్రశేఖర్ రావుకి ఆపరేషన్ జరగడంతో ఆయనను పరామర్శించడా నికి వచ్చానన్నారు. ఆయనతో మాట్లాడాను. కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్లతో కూడా మాట్లాడితే, ఆయన కోలుకుని మామూలుగా నడవడానికి 6 వారాలు పడుతుందని చెప్పారు. కెసీఆర్‌కు ఫిజియోథెరపీ అవసరమని కూడా చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లు చెప్పిన వివరాలు తెలుసుకున్న తర్వాత సంతృప్తికరంగా ఉంది. కేసీఆర్ త్వరగా కోలుకుని, మళ్లీ ప్రజాసేవ కోసం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. ఆయన జారి కిందపడడంతో హిప్ జాయింట్ కు ఫ్రాక్చర్ అయింది. డాక్టర్లు చేసిన శస్త్రచికిత్స కూడా సఫలమైంది. వైద్యులు చెప్పిన వివరాలను బట్టి కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారు. ఆయన ఎలాంటి ఇబ్బందులు లేకుండా మామూలుగా తిరుగుతారు. మెట్లెక్కడం, ఇతర పనులు మామూలుగానే చేసుకోవచ్చు. కేసీఆర్ పరిస్థితి తెలిశాక ఆయనతో ఓసారి మాట్లాడాలని అనిపించింది. అందుకే ఇవాళ ఆసుపత్రి వద్దకు వచ్చాను. కేసీఆర్ కోలుకోవాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు వివరించారు.
పలువురు ప్రముఖుల పరామర్శ
యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను పలువురు ప్రముఖులు, నేతలు పరామర్శిస్తున్నారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. కేసీఆర్ ను కలిసి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్, బీఎస్పీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కూడా కేసీఆర్‌ను పరామర్శించి, క్షేమ సమాచారం తెలుసుకున్నారు. గత గురువారం రాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్రూంలో జారిపడటంతో కేసీఆర్ ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే ఉంటూ కోలుకుంటున్నారు.