- కొత్త ఏడాదిలో సైకో పాలన పోయి..సైకిల్ పాలన వస్తుంది
- వివేకా హత్యలో జగన్ రోజుకో మాట, ఇప్పుడు బాధితులపైనే కేసులు
- హాలీవుడ్ సినిమాను మించిన కథలు అల్లారు
- నాలుగున్నరేళ్లు అందరినీ ఏడిపించాడు..ఇక జగన్ వంతు వచ్చింది
- కుప్పం, మల్లనూరు సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు
కుప్పం/మల్లనూరు: వైసీపీ మునిగిపోయే నావ అని, దాన్ని ఎవరూ కాపాడలేరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీలోనే తిరుగుబాటు మొదలైంది….వాళ్ల ఎమ్మెల్యేలే చెట్టుకొకరు, పుట్టకొకరు వెళ్తున్నారన్నారు. నాలుగున్నరేళ్లుగా జగన్ అందరినీ ఏడిపించాడని, ఇప్పుడు జగన్ వంతు వచ్చిందన్నారు. నా కోసం కాకుండా మీ భవిష్యత్తు కోసం ఇంటికొకరు టీడీపీ జెండా పట్టుకుని బయటకు రావాలని, అడ్డుకున్నవారికి అదే జెండాతో బడితపూజ చేయండని పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరిరోజు శనివారం కుప్పం, మల్లనూరులో పర్యటించారు. కుప్పంలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించి భోజన వితరణ చేశారు. అనంతరం మసీదులో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని, తరువాత పెద్దపులి గంగమ్మను దర్శించుకున్నారు. అనంతరం కుప్పం, మల్లనూరులో నిర్వహించిన బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ అన్ని వర్గాల స్పందన చూస్తున్నా.. మీ స్పందనకు శిరసు వంచి నమస్కరిస్తున్నానన్నారు. నన్ను కుప్పం నుండి 7 సార్లు గెలిపించారు. మళ్లీ గెలిపించబోతున్నారు. టీడీపీ జెండా తప్ప మరో జెండా తెలియని వాళ్లు కుప్పం ప్రజలు. ఒక నాయకుడిగా ఇంతకంటే నాకేం కావాలని అన్నారు. మా భవిష్యత్తుకు మీరే గ్యారంటీ అంటూ పిల్లలు, యువత, ఆడబిడ్డలు కోరుతున్నారు. కుప్పంలో జరిగిన అభివృద్ధి టీడీపీ తప్ప..మరొక పార్టీ చేయలేదు. చెత్త సేకరించడానికి కంపోస్ట్ తయారు చేసే షెడ్లు కడితే..వీళ్లు వచ్చి వాటికి రంగులు వేసుకుంటున్నారు. ఇక్కడ రైతులు, యువత, ఆడబిడ్డలు, చిరువ్యాపారులు ఉన్నారు…ఈ ఐదేళ్లలో మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా.? ఎన్నికల ముందు జాబ్ కేలండర్ అన్నాడు..ఇచ్చాడా? మెగా డీఎస్సీ అన్నాడు..ఐదేళ్లలో ఒక్క టీచర్ నియామకమైనా చేశాడా.? విద్యా వ్యవస్థలో విప్లవం తెచ్చానని చెప్తున్నాడు..స్కూళ్లకు రంగులు వేసుకుంటే విప్లవం వచ్చినట్లా.? ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కోతలు పెట్టి, బటన్ నొక్కుతున్నాడు. అందులోనూ చిదంబర రహస్యం ఉంది..సాక్షి పత్రికకు ప్రకటనల కోసమే బటన్ నొక్కుతున్నాడు. ఆసుపత్రుల్లో రోగులకు అన్నం పెట్టే పరిస్థితి కూడా ఈ రోజు లేదు. ఇలాంటి దద్దమ్మ సీఎంను ఎప్పుడూ నేను చూడలేదు. ఈ ఐదేళ్లలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. 20 ఏళ్ల క్రితం నేను ఐటీకి ప్రాధాన్యం ఇచ్చాను…ఇక్కడ కూడా లక్షల్లో జీతాలు తీసుకునేవారు ఉన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ…సంపద విధ్వంసం చేసే పార్టీ వైసీపీ. మీ అందిరికీ భరోసా ఇవ్వడానికే నేను వచ్చాను. ఏం అభివృద్ధి చేయాలో, ఎలా చేయాలో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశానని చంద్రబాబు చెప్పారు.
ఊరికో సైకో తయారయ్యాడు
జగన్ తో పాటు వైసీపీ నేతలు అబద్ధాలు చెప్పడంలో దిట్టలు. జగన్ మాదిరిగానే ఊరికో సైకో తయారయ్యాడు. మన కుప్పంలో రౌడీయిజం ఎప్పుడైనా ఉందా..కానీ ఇప్పడు రౌడీయిజం చేస్తున్నారు. 5 ఏళ్లుగా బాదుడే బాదుడు. అన్ని ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్, డీజల్, విద్యుత్, బస్సు ఛార్జీలు, పన్నుల భారం పెరిగింది. మీకు ఇచ్చేది పది రూపాయలు..దోచుకునేది వంద రూపాయలు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకం ద్వారా…పది రూపాయలను వంద రూపాయలు చేసే బాధ్యత తీసుకుంటా. వైసీపీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ లు, ఆఖరికి ఎంపీపీలు కూడా అబద్ధాలే చెప్తున్నారు. వివేకా హత్య జరిగి ఐదేళ్లు అయింది. ఇలాంటి హత్య కేసు టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో కూడా చూసి ఉండం. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగింది. చనిపోయిన వెంటనే గుండెపోటు అన్నారు..సాక్షి టీవీలో వార్తలు కూడా వేసుకున్నారు. మళ్లీ తర్వాత రక్తపు వాంతులు చేసుకుని చనిపోయాడని అన్నారు. తలపగిలి ఉండటం చూసి అనుమానం వచ్చిందని అందరూ అన్న తర్వాత హత్య అని చెప్పారు. గొడ్డలితో వివేకా తలను బద్ధలు కొట్టారు. గొడ్డలి పోటు అని బయటకు వచ్చాక నారాసుర రక్త చరిత్ర అని నా మీద నింద వేశారు. తరువాత ఎన్నికల ప్రచారంలో.. మా తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు, మా బాబాయ్ ని హత్య చేశారు అని చెప్పుకుని ఓట్లేయించుకున్నాడు. ఆయన మాటలు విని మీరంతా ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడంటూ ఓట్లు వేశారు. హైకోర్టుకు వెళ్లి హత్య వివరాలు బయటకు చెప్పకూడదని ఉత్తర్వులు తెచ్చుకున్నారు. సీబీఐ విచారణ కావాలని కోర్టుకు వెళ్లాడు..ఎన్నికల తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పాడు. ఊసరవెల్లి మాదిరిగా వివేకా హత్య విషయంలో ప్రవర్తించాడు. తరువాత కొన్నాళ్లకు బెంగళూరులో ఆస్తుల వివాదాలతో హత్య జరిగిందన్నారు. కాదు.. రెండో పెళ్లి వివాదం, అల్లుడు హత్య చేయించాడని చెప్పాడు. కూతురు సునీతారెడ్డి చంపిందని మళ్లీ మాట మార్చారు. సునీల్ యదవ్ తల్లితో వివేహేతర సంబంధం వల్ల చంపారని ఇప్పుడు పుకార్లు పుట్టిస్తున్నారు..అందుకే చెప్తున్నా వివేకా హత్య కేసు ఒక కేస్ స్టడీ. వివేకానందరెడ్డి హత్యలో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని అరెస్టు చేయడానికి సీబీఐ వెళ్తే అన్ని రకాల ప్రయత్నాలు చేసి అరెస్టు కాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఏకంగా సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ పై కేసు పెట్టారు. వివేకా పీఏ కృష్ణారెడ్డిని ప్రభావితం చేసి హత్యలో సునీతారెడ్డి ప్రమేయం ఉందని, దానిపై విచారణ చేయాలని చెప్తున్నారు. ఒక వివేకా కేసు ఎన్ని మలుపులు తిరిగిందో ఆలోచించాలి. హత్యలు చేసిన వారిని పక్కన బెట్టుకుని కాపాడే ప్రయత్నం చేస్తూ ఇతరులపై నేరం నెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు
సైకోను మించినోడు జగన్. రాష్ట్రంలో అన్యాయం జరిగిందని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. ఒకవేళ చెప్తే పోలీసులు వచ్చి కేసులు పెట్టి జైల్లో పెడతారు. నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా కుప్పంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. పోలీసులు కూడా మనసు చంపుకుని పని చేస్తున్నారు. వారి మెడమీద కత్త్తిపెట్టి కేసులు పెట్టకపోతే వారిపైనే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మీ తాతలు, ముత్తాతలు వంశపార్యపరంగా ఆస్తులు ఇచ్చారు..వాటిపై ఇప్పుడు ఎవరి ఫోటో ఉందో ఆలోచించండి..వారసత్వంగా వచ్చిన ఆస్తుల మీద జగన్ ఫోటో వేసుకున్నాడు. సర్వేలు చేసి మిమ్మల్ని అడక్కుండా హద్దురాళ్లకు కూడా జగన్ తన ఫోటో వేసుకున్నాడు. కొత్త చట్టం తెచ్చి ఆయన అనుకున్న విధంగా భూముల రికార్డులు మారుస్తాడు..జగన్ దయాదాక్షిణ్యాల మీద మీరు ఆధారపడాలి. ఇక్కడ మండల పార్టీ కన్వీనర్ ఉన్నాడు..అతనొక గ్రేట్ విలన్..సినిమాలో కూడా ఉండరు. అడవివీడగూరుకు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి ప్రభుత్వం స్థలం ఇచ్చింది. దాన్ని ఆక్రమించుకోవడానికి జేసీబీలతో కాంపౌడ్ వాల్ కొట్టేశారు. మల్లనూరు చెరువును పూడ్చుతుంటే ఎమ్మార్పీఎస్ నేత ప్రకాశ్ అడ్డుకున్నారని దాడి చేశారు. పచ్చార్లపల్లిలో సెల్వం అనే వ్యక్తి ఎన్నోఏళ్లుగా సాగు చేసుకుంటుంటే వారి భూములు లాక్కుని ప్లాట్లు వేసుకుని అమ్ముకున్నాడు. పొన్నంగోలు గ్రామానికి చెందిన అమ్ము అనే మహిళా రైతు సాగు చేసుకుంటున్న భూమిని కూడా తప్పుడు పత్రాలు సృష్టించి లాక్కున్నారు. కొత్త చట్టం ప్రకారం రికార్టులు మార్చేస్తారు. అడంగల్లో మీ పేరు ఉండదు..కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదని చంద్రబాబు అన్నారు.
ఏమరుపాటుగా ఉంటే అంతే..
వచ్చే ఎన్నికల్లో మీరు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. మీ మరణ శాసనం మీరు రాసుకున్నట్లే. ఆడబిడ్డలకు మహాశక్తి పథకం తీసుకొచ్చాను. ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.15 వందలు అందిస్తాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ద్వారా రూ.15 వేలు అందిస్తాం. దీపం పథకం ద్వారా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. ఆడబిడ్డ ఎక్కడికి పోవాలన్నా ఛార్జీలు లేకుండా ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. డ్వాక్రా సంఘాల ద్వారా మీరు ఆర్థికంగా ముందుకు వెళ్లేలా చేస్తా. ఆడబిడ్డలకు ఉద్యోగాలు, కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చా..ఐటీల్లో అమ్మాయిలు కూడా బాగా రాణిస్తున్నారు. నేడు భర్త కంటే భార్య ఎక్కువ జీతం తీసుకుంటోంది. అన్నదాత ద్వారా రూ.20 వేలు ఏడాదికి రైతుకు ఇస్తాం. కుప్పంను హార్టికల్చర్ హబ్ గా చేస్తా..కుప్పంలో ప్రతి ఎకరాలో వాణిజ్య పంటలు పండిరచి ఎగుమతి చేసే విధంగా చేస్తాం. విమాశ్రయాన్ని నిర్మించి కుప్పంను ప్రపంచంతో అనుసంధానం చేస్తాం. గతంలో నేను ఆవులు ఇప్పిస్తానంటే నవ్వారు..కానీ ఇప్పుడు ఆవులే జీవనాధారం అయ్యాయి. కుప్పంలో పది లక్షల లీటర్ల్లు పాల ఉత్పత్తే లక్ష్యంగా పాడి రైతులను ప్రోత్సహిస్తాం. గొర్రెలు పెంచుకోవాలంటే ఇంటి దగ్గరే పెంచే విధంగా చేస్తా. ఇక్కడ మెడికల్, ఇంజీనీరింగ్, ఐటీఐ కాలేజీలు టీడీపీ పెట్టినవే. ఎడ్యుకేషన్ హబ్ గా మార్చి వేరే ప్రాంతాలు వారు కూడా కుప్పం వచ్చి చదువుకునేలా చేస్తా. ఇక్కడికే పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తా. బీసీలకు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొస్తాం. బీసీలు టీడీపీకి వెన్నెముక. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. ప్రతి ఇంటికి మంచినీటిని శాశ్వతంగా అందించే బాధ్యత నాది. వి.కోట దాకా హంద్రీ`నీవా పూర్తి చేసి నీళ్లిచ్చాను..వైసీపీ వచ్చాక దాన్ని పట్టించుకోలేదు. టీడీపీ వచ్చాక పూర్తి చేసి నీటిని అందించే బాధ్యత తీసుకుంటాను. ప్రతి ఎకరాను సస్యశామం చేసే బాద్యత తీసుకుంటాం. రూ.10 ఇచ్చి రూ.100 లాగే ప్రభుత్వం కావాలా… మీ ఆదాయం పెంచే ప్రభుత్వం కావాలో ఆలోచించుకోవాలి. దేశంలోనే కుప్పంను నెంబర్ వన్ గా ఉంచటానకి కృషి చేస్తా. మల్లనూరులో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మిస్తాం. మల్లనూరు, రాళపల్లిగూడురును మండలాలుగా చేస్తాం. మల్లనూరులో పోలీస్ స్టేషన్ కూడా నిర్మిస్తాం. మల్లనూరుకు పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు అందిస్తాం. సెల్ సిగ్నల్స్ రాక ఇబ్బంది పడుతున్నారు…ఆ సమస్య కూడా పరిష్కరిస్తాం. వర్క్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తాం. నవశకం..తెలుగుజాతిది కావాలి. ప్రపంచంలో బలమైన వాళ్లుగా తెలుగు వాళ్లు ఉండాలి. మల్లనూరులో ఎకో టూరిజం కూడా అభివృద్ధి చేస్తాం. వినాయకుడి గుడి వద్ద దౌర్జన్యం చేసి వ్యాపారులను అక్కడ లేకుండా పంపారు. ఇంటి స్థలాలకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. మళ్లీ కుప్పంను నెంబర్ వన్ చేయాలంటే లక్ష మెజారిటీ రావాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
సైకిల్ ఎక్కి ఫ్యాన్ ను చిత్తు చేయాలి
జగన్ పాలనలో భూ కబ్జాలు చేసేవాళ్లకే ఆదాయం తప్ప వైసీపీ నేతలు కూడా నష్టపోయారు. అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, గురుకుల ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు కూడా రోడ్డు మీదకు వచ్చారు. భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ సైకిల్ ఎక్కి ఫ్యాన్ ను చిత్తు చేయాలి. ఫ్యాన్ కు ఉక్కపోత మొదలైంది. రాజకీయాన్ని నేను వ్యాపారంగా భావించలేదు..సేవగా భావించా. నేను ఏ తప్పు చేయను. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే కుప్పంలో అధిక మెజారిటీ రావాలి. నా వారసత్వ్వం కుప్పం ప్రజలే. నేను చేసిన పనుల వల్ల మీ జీవితాల్లో వెలుగు వచ్చిందని చెప్పుకుంటే నాకు అదే చాలు. వేరే పార్టీల వారు వస్తే సహకరించబోమని చెప్పండి. తిమ్మాపురంలో లైట్లువేసుకుని మరీ గ్రానైట్ కొడుతున్నారు. కరుడుగట్టిన నేరస్తుడు సీఎం అయితే పాలన ఇలాగే ఉంటుంది. తల్లి, చెల్లి, బాబాయ్ ని లెక్క చేయనోడికి మీరొక లెక్కా.? మతి స్థిమితం ఉన్నోడు తప్పుడు పనులు చేయడు. పిచ్చోడు చేతిలో రాయి ఉంటే ఎవరో ఒకరిపైన వేస్తాడు. నూతన సంవత్సరంలో సైకో పాలన పోయి..సైకిల్ పాలన వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.