- ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 5 కుటుంబాలకు పరామర్శ
- ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల ఆర్థికసాయం అందజేత
ఎమ్మిగనూరు: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం తట్టుకోలేక, మనస్తాపానికి గురై చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి బాసటగా నిలిచారు. అధైర్యపడొద్దు.. మీకు మేమున్నాం అని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బాధిత కుటుంబాలను భువనేశ్వరి బుధవారం పరామర్శించారు. నియోజకవర్గంలోని నందవరం మండలం, మాచపురం గ్రామంలో పార్టీ కార్యకర్త హనుమంతు(63) గుండెపోటుతో గత ఏడాది అక్టోబర్ 24న మృతిచెందారు. హనుమంతు భార్య పార్వతి, కుమారులు వెంకటేష్, వెంకటరాముడు, ఈశ్వరప్ప, శ్రీనివాసులు, కుమార్తె హేమలతలను భేవనేశ్వరి ఓదార్చారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందించారు. అనంతరం నందవరం మండలం, ముగతి గ్రామంలో మాదిగ నాగరాజు(50) కుటుంబాన్ని పరామర్శించారు. నాగరాజు గత ఏడాది సెప్టెంబర్ 23న గుండెపోటుతో మృతిచెందారు. నాగరాజు భార్య లలితాంబ, కుమారుడు రమేష్, కుమార్తె ప్రియాంకలను భువనేశ్వరి ఓదార్చారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందించారు. అనంతరం గోనెగండ్ల మండలం, బండమీది అగ్రహారం గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 12న గుండెపోటుతో మృతిచెందిన సుధాకర్ నాయుడు(40) కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. సుధాకర్ నాయుడు భార్య రాధమ్మ, కుమారుడు హరికృష్ణ, కుమార్తెలు పుష్పవతి, రమాదేవి లను ఓదార్చారు. అనంతరం గోనెగండ్ల మండలం అల్వాల గ్రామంలో ఆరెకంటి ఈరన్న(45) కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక ఈరన్న గత ఏడాది సెప్టెంబర్ 10న గుండెపోటుతో మృతిచెందారు. ఈరన్న భార్య కర్రిఅక్క, కుమారులు రమేష్, జాన్, రవికుమార్ లను పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల ఆర్థికసాయం అందించారు. అనంతరం గోనెగండ్ల మండలం, ఎర్రబాడు గ్రామంలో పార్టీ కార్యకర్త కౌలుట్లయ్య(60) కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. కౌలుట్లయ్య గత ఏడాది సెప్టెంబర్ 18న గుండెపోటుతో మృతిచెందారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు. కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఓర్వకల్లు విమానాశ్రయం నుండి హైదరాబాద్ కు తిరిగి వెళ్లారు. కర్నూలుజిల్లా రెండ్రోజుల పర్యటనలో భువనేశ్వరి వెంట జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.