- పోరాడి సాధించిన పరిశ్రమ చేజారదు
- అవసరమైతే మనమే నడుపుకుందాం
- ఉత్తరాంధ్రకు జగన్ సర్కారు రిక్తహస్తం
- రుషికొండపై రూ.500 కోట్లతో ప్యాలెస్ విలాసం
- ప్రాజెక్టులు, పరిశ్రమలకు పాతర
- పరిస్థితి మారాలంటే వైకాపా పోవాలి
- అప్పుడు, ఎప్పుడూ ఉత్తరాంధ్ర అభివృద్ధి బాబుతోనే సాధ్యం
- ఆముదాలవలస శంఖారావంలో లోకేష్
‘ఉక్కూ మనదే.. హక్కూ మనదే. పోరాటాలతో సాధించుకున్న పరిశ్రమా మనదే. చేజార్చుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే రాష్ట్రంతరఫున నడుపుకుందాం’ అంటూ యువనేత నారా లోకేష్ సంకల్ప స్వరాన్ని ప్రకటించారు. ఉత్తరాంధ్ర నుంచి మొదలైన శంఖారావంలో ఐదేళ్ల వైసీపీ వైఫల్యాలను యువనేత తూర్పారబట్టారు. పోరాటాల పురటిగడ్డ ఉత్తరాంధ్ర మళ్లీ మహోజ్వలంగా వెలగాలంటే.. తెదేపాను మళ్లీ అధికారంలోకి తెచ్చుకోక తప్పదన్నారు. చైతన్యంతో కదంతొక్కుతున్న పార్టీ శ్రేణులను చూస్తుంటే.. త్వరలోనే తాడేపల్లి గేట్లు బద్ధలయ్యే రోజు దగ్గరపడిరదని, రాసిపెట్టుకోమని అధికార వైసీపీని హెచ్చరించారు. సోమవారం నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస నియోజక వర్గాల్లో యువనేత శంఖారావం సాగింది.
ఆముదాలవలస (చైతన్యరథం): ఉత్తరాంధ్ర అభి వృద్ధిని తిరోగమన దిశకు తీసుకెళ్లిన జగన్‌రెడ్డి, విశాఖ రుషికొండపై రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడని తెలుగుదేశం యువనేత తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాడు. ఉత్తరాంధ్రను విధ్వంసానికి గురిచేసిన జగన్ ను తరమికొడితే తప్ప, ఈ ప్రాంతం బాగుపడే రోజు రాదని హెచ్చరించారు. మూడు రాజధానుల పేరిట ఈ ప్రాంతంతో నాటకాలాడిన జగన్.. ఒక్క పరిశ్రమైనా తెచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగావకాశం కల్పించాడా? అని తీవ్రస్వరంతో నిలదీశారు. ఉత్తరాంధ్ర స్వరూపాన్నే మార్చేయగల రైల్వేజోన్‌ను 53ఎకరాల భూమి ఇవ్వ కుండా.. అభివృద్ధిని పూర్తిగా అడ్డుకున్నాడని దుయ్య బట్టారు. సోమవారం రాత్రి ఆముదాలవలసలో నిర్వ హించిన శంఖారావం సభలో యువనేత లోకేష్, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. ఎందరి పోరాటాలతోనో సాధించుకున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని, దాన్ని ప్రైవేట్ వ్యక్తులతో ఒప్పందాలు చేసుకుని అమ్ముకోవాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉత్తరాంధ్రవాసులకు నేను హామీ ఇస్తున్నా. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వం. ఉక్కూ మనదే. హక్కూ మనదే. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేలా చేస్తాం’ అని హామీ ఇచ్చారు.
అభివృద్ధి సాకారమయ్యేది తెదేపాతోనే..
జగన్ తన పాదయాత్రలో ఆముదాలవలస షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చి మడమ తిప్పాడని, నేటికీ దాన్ని తెరిపించలేకపోయాడని దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పడం తప్ప జగన్‌కి ఇంకేమీ చేతకాదని ఎద్దేవా చేశారు. ఉత్తరాంద్రను అభివృద్ధి చేసింది టీడీపీయేనని, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పక్కా గృహాలు తెదేపా ప్రభుత్వ హయాంలోనే నిర్మించామన్నారు. అప్పుడు, ఎప్పుడూ ఉత్తరాంధ్ర అభివృద్ధి తెదేపాకే సాధ్యమని లోకేష్ అన్నారు. నాడు వంశధార-నాగావళి అనుసంధాన పనులు ప్రారంభిస్తే, వైసీపీ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేకపోయిందని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నాగావళి-వంశధార నదుల అనుసంధానాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆముదాలవలసలో ఎప్పుడూ అభివృద్ధి జరగని విధంగా 2014-19లో చేశామని, నారాయణపురం లిఫ్ట్ ఇరిగేషన్ ఆధునీకరణ పనులు తెలుగుదేశం చలవేనన్నారు. తాగునీటి పథకాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి రూ.16 వందల కోట్లు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. అంతచేసినా, ఇక్కడ డమాబుస్ ఎమ్మెల్యే గెలవడానికి కారణం.. మనం చేసిన మంచిన ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడమేనని అన్నారు. కానీ రాబోయే రెండు నెలల్లో మనం చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని గట్టిగా చెప్పారు.
అతనొక డమాబుస్ ఎమ్మెల్యే..
ఈమధ్యనే `ఇక్కడి డమాబుస్ ఎమ్మెల్యే ఇంటర్య్వూ చూశా. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అన్నాడు. మరి ఎన్టీఆర్ కుమార్తెను అసెంబ్లీలో అవమానిస్తుంటే.. చోద్యం చూశాడు. రాజకీయ భిక్ష పెట్టిన మహనీయుడి నువ్వు చేసిందేంటి..పీకిందేంటి.? అని తీవ్రస్వరంతో ప్రశ్నించారు. శాసన సభకు గౌరవం లేకపోవడానికి కారణం ఈ డమాబుస్ ఎమ్మెల్యేనే. సభా సాంప్రదాయాలు ఉల్లంఘించి సభ సాక్షిగా చంద్రబాబును అవమానిస్తే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ డమాబుస్ ఎమ్మెల్యే, పలాస కొండలరాజుతో అవినీతిలో పోటీ పడుతున్నాడు. ఐదేళ్లలో డమాబుస్ ఎమ్మెల్యే రూ.1000 కోట్లు సంపాదించుకున్నాడు’ అంటూ పరోక్షంగా తమ్మినేనికి చురకలు అంటించారు. ల్యాండ్, శ్యాండ్ మాఫియాకు అడ్డాగా ఆముదాలవలసను మార్చాడని, కాంట్రాక్టర్లును వేధింపులకు గురిచేసి, కొడుకు పెళ్లికి రూ.1.30 కోట్లు వసూలు చేసుకున్న ఘనుడని దుయ్యబట్టారు. ఇసుకలో రూ.300 కోట్లు కొట్టేయడం ఒక ఎత్తయితే, వాలంటీర్, అంగన్వాడీ, షిప్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా డబ్బులెక్కువ ఇచ్చిన వారికి అమ్ముకున్న ఘనుడని విమర్శించారు. పొలం తగాదాలున్నవారిని పంచాయతీ పేరుతో పిలిచి భూములు లాక్కున్న చరిత్ర ఈ డమాబుస్ ఎమ్మెల్యేదని, మైన్లతో పాటు వందల ఎకరాలు బలవంతంగా కొడుకు పేరుపై రాయించుకున్నాడని యువనేత లోకేష్ తీవ్ర వాగ్బాణాలు సంధించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక విచారణ వేసి వడ్డీతో చెల్లించి ప్రజలకు అప్పగిస్తానని హామీ ఇచ్చారు. ఒక స్పీకర్‌గా పని చేస్తుంటే.. నియోజకవర్గం ఎలా ఉండాలి? మంత్రికి ఆదేశాలు జారీ చేయొచ్చు. కానీ సొంత ఆదాయంపైనా ఈ డమాబుస్ ఎమ్మెల్యే ఆలోచించుకున్నాడు తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకున్నదేదీ అని ప్రశ్నించారు. ఆముదాలవలస అభివృద్ధిపై ఏనాడైనా జగన్‌ను అడిగారా? కనీసం ఒక లేఖైనా రాశారా? ఒక్క రోడ్డైనా మంజూరు చేయించుకున్నారా? అని నిలదీశారు. ఆముదాలవలస అభివృద్ధిపై చర్చకు సిద్ధమా డమాబుస్ ఎమ్మెల్యే? అని తీవ్రస్వరంతో లోకేష్ సవాల్ చేశారు.
అభివృద్ధికి రోడ్డు వేసుకుందాం..
తెలుగుదేశంప్రభుత్వం అధికారంలోకిరాగానే నాగా వళి నదిపై బ్రిడ్జిని నిర్మిస్తామని, వంశధార నదిపై పురు షోత్తపురం బ్రిడ్జి ఏర్పాటుచేస్తామని లోకేష్ హామీ ఇచ్చా రు. ఆముదాలవలసలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు,పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికంగా ఉద్యోగాలి స్తామని హామీఇచ్చారు. దేశంలో ఎక్కడికి వెళ్లి నా సిక్కో లువాసులు కనబడతారని, మన ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేకనే వలసలు వెళ్తున్నారన్నారు. శ్రీకా కుళం జిల్లాలో సెజ్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించి వలసలు ఆపే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
అండగా నేనుంటా..
వైసీపీ ప్రభుత్వం నైతికత దిగజారి టీడీపీ కార్యకర్తలపైనే కాదు, జనసేన కార్యకర్తలపైనా అక్రమ కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. అందుకు బాధ్యులైన అందరి పేర్లూ పుస్తకం లో రాశానని, ఎవర్నీ వదలబోనని లోకేష్ హెచ్చరించారు. తెదేపా అధికారంలోకి వచ్చాక జ్యుడిషియల్ విచారణచేసి చర్యలు తీసుకుంటా మని భరోసానిచ్చారు. ‘ఎన్టీఆర్ దేవుడు. చంద్రబాబురాముడు. తప్పుడుగాళ్లకు ఈ లోకేష్ చండశాసనుడు. తప్పుడుగాళ్లను ఎవ్వరినీ వదలను..’ అని హెచ్చరించారు. శంఖారావం ద్వారా పార్టీ శ్రేణులకు ఇచ్చే పిలుపొక్కటే సూపర్ 6ను ప్రజల్లోకి తీసుకెళ్లండి. హామీలను ప్రతి గడపముందూ ఉంచండి. వైసీపీకి వాలంటీర్లుంటే.. మనకు 60లక్షల మంది కార్యకర్తలున్నారు. దేనికీ భయపడాల్సిన పనేలేదు. మీవెంట నేనున్నా’ అని శ్రేణులకు లోకేష్ ధైర్యాన్నిచ్చారు. టీడీపీ జనసేన కలిసి సైకోను, సర్కార్‌ను తమిరికొట్టాలని పిలుపునిచ్చారు.