అమరావతి: ఒకటో తారీఖున పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బును జగన్‌రెడ్డి తనఅనుకూల కాంట్రాక్టర్లకు మొత్తం ఊడ్చిపెట్టాడని,దీంతో పింఛన్ల సొమ్ములు ఇవ్వ డానికి నేడు ఖజానాలో సరిపడా డబ్బులు లేకుండా పోయాయని, అందుకే జగన్‌రెడ్డి తన దుర్మార్గాన్ని కప్పిపెట్టుకోవడానికి ఎన్నికల కమిషన్‌పైనా, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పైన దుష్ఫ్రచారానికి పాల్పడుతున్నాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి విమర్శించారు. గతంలో వివేకా హత్య కేసు, కోడికత్తి కేసు, వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ లాంటి అంశాల్లో అబద్దపు ప్రచారాలు చేసి ఎలా డ్రామాలు ఆడారో…ఇప్పుడు వాలంటీర్ల డ్రామా ఆడుతున్నారని, కానీ ప్రజలు వీరి మోసపు మాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరని ఆయన పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పింఛన్ డబ్బులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టేసి డబ్బులు లేని కారణంగా 3న పింఛన్ల పంపిణీ అంటూ సాక్షి పత్రికలో రాశారని, ఇప్పుడు వాలంటీర్ల చేత పింఛన్ల పంపిణీని నిమ్మగడ్డ రమేష్, ఎన్నికల కమిషన్ అడ్డుకున్నారని ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు.
నాడు గొడ్డలితో క్రూరాతి కూరంగా వైఎస్ వివేకాను నరికేసి గుండె పోటుతో చనిపోయారని సాక్షి పత్రికలో అబద్ధాలు చెప్పారని, అది గుండె పోటు కాదని ప్రజలు గ్రహించిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అని మరో అబద్ధం చెప్పారని, గొడ్డలి వేటు వెనుక అవినాష్ రెడ్డి, అతని వెనుక తాడెపల్లి ప్యాలెస్ ఉందని తెలిసిన తర్వాత ఇప్పుడు సునీతా రెడ్డి హత్యే చెయించిందని కట్టు కథలు అల్లుతున్నారని, అలాగే వాలంటీర్ల విషయంలోనూ టీడీపీపైన అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కోడి కత్తితో హత్యా ప్రయత్నం వెనుక టీడీపీ నేతలు ఉన్నారని, తిరుమల వెంకటేశ్వరుని పింక్ డైమెండ్ చంద్రబాబు వద్ద ఉందని…ఇటువంటి అబద్ధాలన్నీ చెప్పి ప్రజలను తప్పు దారి పట్టించి తర్వాత రాష్ట్రాన్ని అడ్డగోలుగా లూటీ చేశారని, మరోసారి ఎన్నికల ముందు పింఛన్ల పంపిణీపై వైసీపీ నేతలు, సాక్షి మీడియా అబద్దాలను ప్రచారంలో పెడుతున్నారని, అయితే ఈసారి ప్రజలు వీరి అబద్దాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని మాల్యాద్రి పేర్కొన్నారు.