- దాడులు, విధ్వంసాలతో ప్రజాతీర్పును మార్చలేరని స్పష్టీకరణ
- టీడీపీ కేడర్ సహనాన్ని చేతకానితనంగా భావించొద్దని హెచ్చరిక
అమరావతి (చైతన్యరథం): ఓడిపోతున్నామన్న ఉక్రోషంతోనే వైసీపీ రౌడీమూకలు ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో టీడీపీ కార్యాలయం దగ్ధం చేసిన ఘటనపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రోసూరులో జరిగిన చంద్రబాబు ప్రజాగళం సభ జనసునామీని తలపించడంతో వైసీపీ మూకల ఉన్మాదం కట్టలు తెంచుకుంది. ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని తేలిపోవడంతో అర్ధరాత్రివేళ ఎవరూ లేని సమయంలో టీడీపీ కార్యాలయానికి నిప్పుపెట్టి రాక్షసానందం పొందారు. దాడులు, విధ్వంసంతో ప్రజాతీర్పును మార్చలేరన్న విషయాన్ని జగన్, ఆయన సామంతరాజైన ఎమ్మెల్యే శంకర్రావు గుర్తించాలి. త్వరలో వైసీపీని జనం బంగాళాఖాతంలో కలపబోతున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీ కేడర్ సహనాన్ని చేతగానితనంగా భావించవద్దు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల క్రతువును నిర్వహించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది. పోలీసులు తక్షణమే స్పందించి క్రోసూరు ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.