- కీలక పత్రాలు దగ్ధం చేస్తూ దొరికిపోయిన సిబ్బంది
- వైరల్‌గా మారిన డాక్యుమెంట్ల దహనం వీడియోలు
- జగన్ రెడ్డి ఓటమి ఖాయమవ్వడంతో కళంకిత అధికారుల్లో వణుకు
- తెలంగాణలో మాదిరి ఆధారాలను తుడిచేసే ప్రయత్నం
అమరావతి,చైతన్యరథం: రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడనుందని ఖాయమవ్వడంతో ఇన్నాళ్లూ జగన్‌రెడ్డి అడుగులకు మడుగులొత్తిన కళంకిత అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జగన్‌రెడ్డి ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ఈ ఐదేళ్ల పాటు సాగించిన అరాచకానికి అణాపైసలతో సహా తిరిగి చెల్లించుకోవాల్సి వస్తుందనే భయం వారిలో వణుకు పుట్టిస్తోంది. దీంతో ఇన్నాళ్లూ తాము చేసిన తప్పులను తుడిచేసే పనిలో పడ్డారు. ఇదే పనిచేస్తూ సీఐడీకి సంబంధించిన సిట్ అధికారులు ప్రత్యక్షంగా ప్రజలకు దొరికిపోయారు. సిట్ సిబ్బంది తమ కార్యాలయంలోని కాంపౌండ్‌లో గుట్టల కొద్దీ డాక్యుమెంట్లను, కీలక పత్రాలను సోమవారం దహనం చేశారు. వీటిని స్థానికులు ప్రత్యక్షంగా గమనించి వీడియోలు తీశారు. ఆ డాక్యుమెంట్లలో హెరిటేజ్ సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. వీటిని ఎందుకు దహనం చేస్తున్నారని స్థానికులు నిలదీయగా సిట్ చీఫ్ రఘురామిరెడ్డే స్వయంగా తమను ఆదేశించారని సిబ్బంది చెప్పారు.
ఆ పత్రాలను ఎందుకు దగ్ధం చేశారు?
కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో… రాష్ట్రంలో అధికార మార్పిడి ఖాయమని తేలిన నేపథ్యంలో సిట్ కార్యాలయంలో బండిళ్ల కొద్ది డాక్యుమెంట్లను కాల్చేయటం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఆఫీసులోని కీలక పత్రాలను కొన్నింటిని దహనం చేయబోతున్నారని తెలుసుకొన్న సిబ్బందిలో కొంతమంది కూడా వీడియోలు తీశారు. ఈ వీడియోలన్నీ మీడియాకు, సోషల్ మీడియాకు చేరి వైరల్‌గా మారాయి. కాగా ఈ వీడియోపై సిట్ చీఫ్ కొల్లి రఘురామిరెడ్డి ఇచ్చిన వివరణ మరిన్ని అనుమానాలను పెంచింది. హెరిటేజ్ సంస్థ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చేందుకు వేల కొద్ది పేజీలను జిరాక్స్ తీస్తామని, ఆ సమయంలో నలిగిపోయిన, ఫేడ్ అయి పోయిన పేజీలు ఉంటాయని, వాటిని మాత్రమే దగ్ధం చేశామని చెప్పారు. హెరిటేజ్ కేసులో గానీ, ఇతర కేసుల్లో గానీ చంద్రబాబుకు, లోకేష్‌కు నోటీసులు ఇచ్చి నెలలు దాటి పోయింది. పాడైపోయిన పేపర్లను అప్పుడే చించి పడేస్తారే తప్ప ఇన్ని రోజులు దాచిపెట్టుకోరు కదా? సిట్ చీఫ్ ఇచ్చిన సమాధానంలో తిరకాసు కనిపిస్తోంది. చంద్రబాబును, లోకేష్‌ను వివిధ కేసుల్లో ఇరికించేందుకు తప్పుడు మార్గాల్లో సేకరించిన డాక్యుమెంట్లనే దహనం చేశారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమనేట్లుగా రఘురామిరెడ్డి వివరణ కనిపిస్తోంది.
చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా సీఐడీ తప్పుడు కేసులు
గత నాలుగేళ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కేంద్రంగానే ఏపీ సీఐడీ పనిచేసింది. వారిని అరెస్టు చేసేందుకు ఏవేవో తప్పుడు కేసులను సృష్టించింది. ఈ క్రమంలోనే చంద్రబాబుపై వరుసగా తప్పుడు కేసులు బనాయించి.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయనను అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు రాజమండ్రి జైల్లో ఉంచారు. అయితే, సీఐడీ అధికారులు కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించకపోవటంతో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇక నారా లోకేష్‌పై అవుటర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసులు పెట్టారు. ఇప్పటికి రెండు మూడు సార్లు లోకేష్‌ను కూడా విచారించారు. చంద్రబాబు కి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ అనేక మందిపై ఒత్తిడి తెచ్చారు. ఎటువంటి అనుమతులు లేకుండా హెరిటేజ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఐటి రిటర్న్స్, ఇతర కీలక డాక్యుమెంట్స్ దొడ్డి దారిన సీఐడీ అధికారులు సంపాదించారు. అవే డాక్యుమెంట్స్ చూపించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ప్రశ్నించారు. కేసుతో సంబంధం లేని వారి వ్యక్తిగత పత్రాలు మీ చేతికి ఎలా వచ్చాయని ఆ రోజే అధికారులను లోకేష్ నిలదీశారు. చంద్రబాబు,లోకేష్‌ను అనేక కేసుల్లో ఇరికించేందుకు అనేక తప్పుడు పత్రాలను సీఐడీ అధికారులు సృష్టించారు. అయితే రానున్న ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని జాతీయ సర్వేలు, నిఘా వర్గాల నివేదికలు రావడంతో సీఐడీ అధికారుల్లో వణుకు మొదలైంది. అందుకే తాము చట్టవిరుద్ధంగా సేకరించిన వివరాలు, సృష్టించిన ఫేక్ ఆధారాలు, కీలక డాక్యుమెంట్లను తగలబెట్టేశారు.
తెలంగాణ సీన్ రిపీట్
తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడూ కేసీఆర్ మెప్పు కోసం అధికారులు అడ్డంగా పని చేశారు. తీరా అధికారం పోయిన తర్వాత తామెక్కడ దొరికిపోతామోనని చాలా శాఖల్లో ఫైళ్లను కాల్చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి అయితే పోలీస్ ఉన్నతాధికారి ప్రణీత్‌రావు టెక్నికల్ డేటాను అంతా డిలీట్ చేసి హార్డ్‌డిస్క్‌లను నాశనం చేసి ఎక్కడో మూసి నదిలో పడేశాడు. అయినప్పటికీ అతను చట్టం నుండి తప్పించుకోలేపోయాడు. అతనితోపాటు ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం ఉన్న నిఘావర్గంలోని ఉన్నతాధికారులు కూడా ఇరుకున్నారు. చివరకు అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు దేశం విడిచి పారిపోయారు. తెలంగాణ మాదిరే ఇప్పుడు ఏపీలో సీన్ రిపీట్ అవుతోంది. ఇప్పటికే జగన్‌రెడ్డి ఓడిపోవడం ఖాయమని తేలడంతో కళంకిత అధికారుల్లో భయం మొదలైంది. తాము చేసిన తప్పులను తుడిచేసే పనిలో పడ్డారు. ఒక్క సిట్ కార్యాలయంలోనే కాక ఇంకా అనేక ఇతర శాఖల్లోనూ తాము చేసిన తప్పుడు పనులను తుడిచేసే చర్యలు ఇంకా మున్ముందు కూడా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం ఈ అంశంపై దృష్టి సారించి ప్రభుత్వ డాక్యుమెంట్లకు రక్షణ కల్పించేలా అధికార వర్గానికీ పటిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఆ డాక్యుమెంట్స్ అత్యంత ప్రాధాన్యమైనవి: సీఐడీకి హెరిటేజ్ కంపెనీ సెక్రటరీ లేఖ
తాడేపల్లి సిట్ కార్యాలయంలో హెరిటేజ్ పత్రాల దగ్ధంపై మీడియాలో వచ్చిన కథనాలపై హెరిటేజ్ కంపెనీ సెక్రటరీ ఉమా కాంత్ బారిక్ స్పందించారు. ఈ ఘటను సంబంధించి సీఐడీ అడిషనల్ ఎస్పీకి ఉమాకాంత్ లేఖ రాశారు. సీఐడీ కస్టడీలో ఉన్న తమ ఒరిజినల్ డాక్యుమెంట్లు, మినిట్ పుస్తకాలను అధికారుల కోరిక మేరకు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. హెరిటేజ్‌కు సంబంధించిన పత్రాలను దగ్ధం చేసినట్లు సోషల్ మీడియా, టీవీ వార్తల్లో వచ్చిన అంశాన్ని ప్రస్తావిస్తూ తాము ఇచ్చిన డాక్యుమెంట్లు చాలా కీలకమైనవని పేర్కొన్నారు. తాము దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరించడమే కాకుండా న్యాయబద్ధులమై ఉంటామని, ఇదే సమయంలో డాక్యుమెంట్ల భద్రత కూడా అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశమన్నారు. మీడియాలో వచ్చిన కథనాలు సీఐడీ కస్టడీలో ఉన్న తమ డాక్యుమెంట్ల భద్రతను ప్రశ్నార్ధకం చేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై తమకు పూర్తిస్థాయి పరిస్థితిని వివరించాలని, తమ డాక్యుమెంట్లు భద్రంగా ఉన్నాయమని తమకు చూపించాలని కోరారు. దర్యాప్తులో పారదర్శకత, నిబద్ధత.. న్యాయ ప్రక్రియలో ప్రజా విశ్వాసాన్ని పొందుతాయన్నారు. ఈ డాక్యుమెంట్లు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నవని ఉమాకాంత్ వివరించారు.