- అడ్డగోలుగా అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్‌డీ
- చంద్రబాబు వస్తే పెట్టుబడులు…జగన్ వస్తే దాడులు!
- ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన ఆర్కేను ప్రజలు నిలదీయాలి
- ఈ ఉగాదితోనైనా విధ్వంసపాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలి
మంగళగిరి(చైతన్యరథం): సంక్షేమం పేరుతో పేదల ఖాతాల్లో రూ.10 వేసి రూ. 100 లాగేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య.. 5ఏళ్లలో 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే సాకుతో సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారు.. ఎవరి హయాంలో ఎక్కువ సంక్షేమం జరిగిందో చర్చించడానికి మేం రెడీ…మీరు సిద్ధమా అని యువనేత నారా లోకేష్ సీఎం జగన్‌రెడ్డికి సవాల్ విసిరారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా చినకాకాని జూపిటర్ అపార్ట్‌మెంట్ వాసులతో బుధవారం యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… చరిత్రలో 100 సంక్షేమ పథకాలను రద్దుచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని విమర్శించారు. కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్‌డీ చేశారు, ఎన్నికల సమయంలో ఎడపెడా హామీలిచ్చి ప్రజలు నిలదీస్తారని పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు. పేదవిద్యార్థుల ఉన్నత విద్య కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీవిద్య పథకాన్ని నిర్వీర్యం చేశాడు. జగన్ ఇద్దరు కుమార్తెలు విదేశాల్లో చదువుతున్నారు, పేదపిల్లలు విదేశాలకు వెళ్లి మంచి చదువులు చదవకూడదా? విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎగనామం పెట్టాడు. మేం అధికారంలోకి వచ్చాక పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం తెస్తాం. ఫీజు బకాయిల కారణంగా యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో చిక్కుకుపోయిన 6 లక్షలమంది సర్టిఫికెట్లను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసి విద్యార్థులకు అందజేస్తాం. జగన్ ఇచ్చిన హామీలపై ఎవరైనా నేరుగా లేదా సోషల్ మీడియాలో నిలదీస్తే తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారు. గత అయిదేళ్లుగా ఏపీ సమాజం భయంతో బతుకుతోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. జగన్‌ను అరెస్టు చేస్తే వేలకోట్ల రూపాయల అవినీతి బయటకు వచ్చింది, చంద్రబాబుని అరెస్టు చేస్తే ఆయన చేసిన అభివృద్ధి గుర్తుకు వచ్చింది. తప్పుడు కేసులతో చంద్రబాబును 53రోజులు జైలులో పెడితే ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో తెలుగుప్రజలు రోడ్లపైకి వచ్చిన ఆందోళనలు చేశారు. 5కోట్లమంది ప్రజల ఆశీస్సులతో ఆయన సింహంలా బయటకు వచ్చారు. చంద్రబాబు వస్తే రాష్ట్రానికి రోజుకో పెట్టుబడి వస్తుంది, జగన్ మళ్లీ వస్తే ప్రతిరోజూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడుల వార్తలే కన్పిస్తాయి. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి మద్దతు తెలిపిన జగన్… అధికారంలోకి వచ్చాక మాటతప్పి మడమతిప్పారు. జగన్ ఒక విధ్వంస పాలకుడు… ప్రజావేదిక విధ్వంసంతో పాలన ప్రారంభించాడు. పోలవరం, అమరావతిని నాశనంచేసి మూడుముక్కలాట ఆడారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి మా నినాదం, అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో అమరావతి పనులు ప్రారంభిస్తాం. భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన బకాయిలన్నీ వడ్డీతో సహా చెల్లిస్తామని యువనేత లోకేష్ స్పష్టం చేశారు.
అభివృద్ధి అంటే ‘మంగళగిరి మోడల్’ అనేలా చేసిచూపిస్తా!
దేశం మొత్తం అభివృద్ధి అంటే గుజరాత్ మోడల్ అంటారని… రాబోయే రోజుల్లో మంగళగిరి మోడల్ అనేలా అభివృద్ధి చేస్తానని యువనేత నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం చినకాకానిలోని జూపిటర్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్ వాసులతో బుధవారం యువనేత సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ఈ ఉగాదితోనైనా విధ్వంసపాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలని కోరుకుంటున్నా. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే ఆర్కేను నిలదీయాలి. వందరోజుల్లో అమరావతి పనులు ప్రారంభించి పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తాం. అభివృద్ధిలో దేశం మొత్తం మంగళగిరి వైపు చూసేలా చేస్తాం. ఐటీ, ఇతర పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు కుళాయి ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం. పెరిగిన పన్నులు, ధరలను తగ్గిస్తాం. బ్లాక్ మోడల్ తరహాలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాం. దక్షిణ భారతంలోనే మంగళగిరిని గోల్డ్ హబ్ గా అభివృద్ధి చేస్తాం. దీంతో అదనంగా 40వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మంగళగిరి నియోజకవర్గంలో గంజాయి పెద్ద సమస్యగా ఉంది. ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోనే పెద్దఎత్తున గంజాయి లభిస్తోంది. సీఎం ఇంటి సమీపంలో గ్యాంగ్ రేప్ జరిగి ఏళ్లు గడిచినా నిందితులను పట్టుకోలేదు. వంద రోజుల్లో గంజాయి సమస్యలకు చెక్ పెడతాం. 2019 ఎన్నికల్లో 5,350 ఓట్లతో నేను ఓడిపోయాను. అప్పటి నుంచి కసితో పనిచేస్తున్నా. మంగళగిరిలో గతంలో ఎవరూ చేయని విధంగా 29 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ప్రతిపక్షంలో ఉండగానే బీపీవో కంపెనీ తీసుకువచ్చి 150 మందికి ఉద్యోగాలు కల్పించాం. ఈ ఎన్నికల్లో ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే దేశం మొత్తం మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేస్తానని యువనేత లోకేష్ చెప్పారు.
నేలపై తిరిగితే అభివృద్ధి కనిపిస్తుంది: పెమ్మసాని
గుంటూరు పార్లమెంటు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ… చంద్రబాబు హయాంలో ఏం అభివృద్ధి జరిగిందని జగన్ అంటున్నారు, బాబు హయాంలో చేసిన అభివృద్ధి చూడాలంటే హెలికాప్టర్లపై కాకుండా నేలపై తిరగాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24వేల కిమీల సీసీ రోడ్లు వేశారు. పట్టిసీమ నిర్మాణంతో రైతులను ఆదుకున్నారు. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం. ఎన్నికలు రాగానే జగన్ ఓట్ల రాజకీయం ఆడుతున్నారు. వైసీపీ వాళ్లు కాకపోతే పింఛన్లు తీసేస్తున్నారు. పింఛన్ల పేరుతో వికృత రాజకీయ క్రీడకు తెరలేపారు. శవరాజకీయాలు చేస్తున్న జగన్‌ను ప్రజలంతా తిప్పికొట్టాలని పెమ్మసాని పిలుపునిచ్చారు.
విజనరీ లీడర్ అవసరం: చిల్లపల్లి
జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం ఒకతరం వెనకబడి పోయిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం కోలుకోవాలంటే చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ అవసరం. వైసీపీ అధికారంలోకి వచ్చాక మంగళగిరి ప్రాంతంలో బిల్డర్లు పారిపోయారు. రాష్ట్రాన్ని జగన్ యాచించే స్థాయికి దిగజార్చాడు. ఐదేళ్లు దోపిడీపై తప్ప అభివృద్ధిపై దృష్టిపెట్టలేదు. ఆహ్లాదాన్ని పంచే హాయ్‌ల్యాండ్ నేడు బూత్ బంగ్లా మాదిరి తయారైంది, లోకేష్ గెలుపు ` మంగళగిరి అభివృద్ధికి మలుపు కాబోతుంది. రాష్ట్రమంతా మంగళగిరివైపు చూస్తోంది. మరోమారు వైసీపీ ఉచ్చులో పడకుండా ఓటర్లు విచక్షణతో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలి. వైసీపీ అంటేనే గొడవల బ్యాచ్, ఎటువంటి గొడవ చేసినా డైవర్ట్ కాకుండా లోకేష్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని శ్రీనివాసరావు విజ్ఞప్తిచేశారు.
లోకేష్ దృష్టికి అపార్ట్‌మెంట్ వాసుల సమస్యలు..
జూపిటర్ అపార్ట్‌మెంట్ వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు ఇవ్వడం లేదు. 80శాతం మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు డబ్బు పడలేదు. గన్నవరం విమానశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులు కల్పించాలి. గోపాల మిత్రలను ఆదుకోవాలి. కోతలు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. విదేశీ విద్య పథకాన్ని నిలిపివేసి ఇబ్బంది పెడుతున్నారు. ఎస్‌ఆర్‌ఎం, విట్‌కు వెళ్లే రోడ్లు పాడైపోయాయి, చదుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. లోకేష్ స్పందిస్తూ వచ్చే ప్రభుత్వంలో గోపాల మిత్రలను ఆదుకుంటామని, గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి, ఇంటివద్దకే పెన్షన్లతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామన్నారు. పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని తీసుకురావడంతో పాటు 6 లక్షల మంది విద్యార్థులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసి సర్టిఫికెట్లు అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు.
పట్టాలు రిజిస్ట్రేషన్ చేయిస్తానని ఆర్కే మోసం చేశారు! – లోకేష్ ఎదుట యార్లగడ్డ సుబ్బారావు కాలనీ వాసుల గోడు
పింఛన్ల విషయంలో టీడీపీపై జగన్ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు, రాబోయే ప్రజా ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా పింఛన్లతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను ఇంటి వద్దే అందిస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు. చినకాకాని యార్లగడ్డ సుబ్బారావు కాలనీ వాసులతో యువనేత బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ప్రభుత్వ చేతగానితనం వల్లే ఈనెలలో సకాలంలో పింఛన్ అందక 32మంది చనిపోయారు. మా ప్రభుత్వం వచ్చాక పింఛన్‌ను 4వేల రూపాయలకు పెంచడంతోపాటు వాలంటీర్ల ద్వారా ఇతర సంక్షేమ పథకాలను అమలుచేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు సమస్యలను చెబుతూ… మా ప్రాంతంలో 400 కుటుంబాలు ఉన్నాయి, గత ఎన్నికల సమయంలో ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని చెప్పిన ఆర్కే ఐదేళ్లుగా కన్పించకుండా పోయారు. మా ప్రాంతంలో అంగన్ వాడీ భవనం, వాటర్ ట్యాంక్ నిర్మించాలి. స్కూలు, వీధిదీపాలు ఏర్పాటుచేయాలి. 1999లో చంద్రబాబు హయాంలో ఇచ్చిన ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి, శ్మశాన వాటిక ఏర్పాటుచేయాలి. యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. యువనేత లోకేష్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే ఆర్కేకు పనిచేసే మనసులేదు. ఆయన అద్భుతమైన నటుడు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే కాలనీవాసులు కోరిన విధంగా ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని లోకేష్ హామీ ఇస్తారు. కాలనీవాసులు నా దృష్టికి తెచ్చిన సమస్యలన్నింటిటీ పరిష్కరిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.