- జగన్ పాలనలో మైనారిటీలకు తీరని అన్యాయం
- ప్రాణరక్షణ కరవైందీ జగన్ ఏలుబడిలోనే…
- కూటమితో ముస్లింలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు
- హజ్ యాత్రీకులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తా
- కూటమి ‘సూపర్ సిక్స్’ ముందు జగన్ మేనిఫెస్టో ఫ్లాప్
నెల్లూరు (చైతన్యరథం): పధ్నాలుగేళ్ల నా పాలన చూశారు. ఐదేళ్ల జగన్ పాలనా చూశారు. ఎవరి పాలనలో ముస్లింలకు ఎక్కువ న్యాయం జరిగిందో మీరే చెప్పాలి. ప్రజారంజక పాలన ఎప్పటికీ గుర్తుంటుంది. స్వార్థంతో పాలన సాగిస్తే.. ఆ మోసం ఎంతకాలమో ఆగదు’ అని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరులోని షాదీ మంజిల్‌లో ఆదివారం ముస్లింలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ముస్లిం సోదర సోదరీమణులందరికీ అస్సాలామాలేకుం…’ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన చంద్రబాబు `అనేక అంశాలను ప్రస్తావిస్తూ ముస్లింలలో ఆత్మస్థయిర్యాన్ని నింపే చైతన్యవంతమైన ప్రసంగం సాగించారు. ‘ముస్లింలంటే గుర్తుకొచ్చేది నమ్మకం, ధైర్యం. కష్టాన్ని నమ్ముకొని జీవించే మనస్థత్వం. అన్ని రంగాల్లో ముస్లింల ప్రాధాన్యత ఉంది. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో జీవనం సాగించాలని ముస్లింలు కోరుకుంటారు. ముస్లింలు లేకపోతే అభివృద్ధి లేదు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ముస్లింలకు జగన్ ఏం చేశాడని?
2014 విభజన అనంతరం 16వేల కోట్ల లోటు బడ్జెట్‌వున్నా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి దిశగా నడిపించానని గుర్తు చేసుకున్నారు. ప్రపంచపటంలో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉందంటే అది టీడీపీ చలువేనని, అక్కడి ముస్లిం బావున్నారంటే అది టీడీపీ కృషేనన్నారు. టీడీపీ ఎన్డీయేలోవున్న ఏ సందర్భంలోనూ ముస్లింలకి అన్యాయం జరగలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ తెస్తే, పీఎం వాజ్‌పాయ్ సహకారంతో హైదరాబాద్‌లో ఉర్దూ యూనివర్సిటిని ఏర్పాటు చేసింది తానేనని గుర్తు చేశారు. మైనారిటీల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు హైదరాబాద్‌లో, విభజన తరవాత కడప, విజయవాడలోను హజ్‌హౌస్‌లు కట్టించామని గుర్తు చేశారు. ప్రస్తుతం సమావేశం జరుగుతున్న షాదీమందిర్‌నీ రూ.8 కోట్లతో మూడంతస్థుల భవనంగా నిర్మించుకున్నామని చెప్పారు. ఐదేళ్ల పాలనలో ముస్లింలకు జగన్‌రెడ్డి ఏం చేశాడని ప్రశ్నించారు. దుల్హన్ పథకం అమలు, ఉర్దూని రెండో భాషగా ఏర్పాటు, రంజాన్ తోఫా, విదేశీ విద్యలాంటి అభివృద్ధి పథకాలు టీడీపీ ప్రవేశపెట్టినవేనని చంద్రబాబు అన్నారు. విదేశీ విద్య విధానంతో 527మంది విద్యార్ధులకు రూ.15 లక్షల ఆర్ధిక సాయం, ఏటా 10వేలమందికి రూ.3 లక్షల రుణం, దర్గాలు, మసీదులు, ఈద్గాల మరమ్మత్తులకు నిధులు, ఇమాం, మౌజన్‌లకు గౌరవ వేతనం ఇచ్చింది టీడీపీయేనన్నారు. నెల్లూరులో రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా చేశామని, అబ్దుల్‌కలాం ఆజాద్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని, మహిళలకు గోషా హాస్పిటల్ నిర్మించామన్నారు. ఇస్లామిక్ బ్యాంక్ పెడతానన్న జగన్ `కనీసం ఆ ఒక్కటైనా చేశాడా? అని నిలదీశారు. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ `తానొక్కడే బావుండాలని కోరుకునే సైకో అని బాబు వ్యాఖ్యానించారు.
ముస్లింలపై దమనకాండ దారుణం
జగన్ ఏలుబడిలో ముస్లిం బిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని, 50మందికిపైగా దాడులు జరిగింది ఐదేళ్లలోనేనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాంని దొంగగా చిత్రీకరించి `కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి తెచ్చారు. పలమనేరులో మిస్బా అనే విద్యార్ధిని వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. నర్సరావుపేటలో వక్ఫ్ బోర్డును వైసీపీ నాయకులు ఆక్రమిస్తే అడ్డుకున్నందుకు చంపేశారు. మాచర్లలో 100మంది ముస్లిం కుటుంబాలను బహిష్కరించారు. నందికొట్కూరులో మహిళ నమాజ్‌కి వెళ్లి వస్తుంటే బుర్కా తీసి అవమానించడంతోపాటు ఆమె కుటుంబ సభ్యులను హీనంగా కొట్టిన పార్టీ వైసీపీ. గతంలో టీడీపీ హయాంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయా? అని ముస్లిం వర్గాలు ఆలోచించాలన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్సీ బిల్లులకు పార్లమెంట్‌లో కేంద్రానికి సపోర్ట్ చేశారు. ఏ2 విజయసాయిరెడ్డి బిల్లుకు మద్ధతుగా సంతకం కూడా పెట్టారు. ఇప్పుడు ముస్లింలకు టీడీపీ అన్యాయం చేస్తుందంటూ నాటకాలాడుతున్నారు. మభ్యపెట్టి మోసాలు చేసి ముస్లింలను అమాయకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ అని చంద్రబాబు దుయ్యబట్టారు.
జగన్ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్
తాజాగా జగన్ ప్రకటించిన మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కూటమి ‘సూపర్ సిక్స్’ పథకాలు ప్రకటించి రాష్ట్ర సంక్షేమం దిశగా దూసుకుపోతోందన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 ఇస్తామని, తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్ధికి రూ.15వేలు చొప్పున ఎంతమందంటే అందరికీ ఇస్తామన్నారు. సుపరిపాలనతో పెరిగిన నిత్యావసర ధరలను తగ్గిసామని, ఏడాదికి 3 సిలెండర్లు ఉచితంగా ఇస్తామని, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. నేను సంపద సృష్టించి ఆదాయం పెంచితే, జగన్ ఉత్తుత్తి బటన్‌లు నొక్కుతున్నాడని విమర్శించారు. ఐదేళ్లుగా ఆదాయం పోయింది. పోలవరం, అమరావతిని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రజల కోసం కలిసింది. కేంద్రం నుంచి నిధులు, పనులు కావాలంటే మూడు పార్టీలు కలిసి ఉండాలి. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నాది. పేదవాళ్ల కోసం సంపాదించి పెంచిన ఆదాయాన్ని పంచుతాను. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల చేతుల్లో చిప్ప పెడతాడని విమర్శించారు.
హజ్ యాత్రీకులకు రూ.లక్ష
హజ్ యాత్రీకులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ముస్లింల మనోభావాలను గౌరవించే టీడీపీ, జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తుందన్నారు. ముస్లింల కోసం గురుకుల పాఠశాల 90 శాతం పూర్తి చేశామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.