గుడివాడ: జగన్‌రెడ్డిది డబుల్ డి (దాడులు, దోపిడీలు) ప్రభుత్వమని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ విమర్శించారు. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో ప్రజల ఆస్తులు కాజేయాలని వైకాపా నేతలు చూస్తున్నారని ఆరోపించారు. ముందు పట్టాదారు పుస్తకాలపై తన బొమ్మ వేసుకున్నాడని, ఆ తర్వాత సరిహద్దు రాళ్లపై తన బొమ్మ వేసుకున్నాడని తెలిపారు. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని, జిరాక్స్ కాపీలు మనకు ఇస్తారట అని విమర్శించారు. ఈ చట్టం వల్ల… మన భూములపై కనీసం రుణం తెచ్చుకునే అవకాశం కూడా ఉండదని, ఎందుకంటే, భూముల ఒరిజిల్ పత్రాలు ప్రభుత్వం అట్టిపెట్టుకుంటుందని వివరించారు. ప్రజల భూములపై ప్రజలకు హక్కు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇది జగన్ భూ దోపిడీ విధానం అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రజలు తమ ఆస్తులు కాపాడుకోవాలంటే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్లు జిల్లాకు ఆయన పేరు పెట్టి హెల్త్యూనివర్సిటీకి ఉన్న ఆయన పేరు తీసేశారు. అప్పటికే యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఉన్నప్పుడు దాన్ని తీసేయాల్సిన అవసరమేంటి? తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిన గొప్ప వ్యక్తికి ఇదేనా మీరిచ్చే గౌరవం? ఇంట్లో ఆడవాళ్లను కూడా వైకాపా నేతలు వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. జనసేన సభ కోసం స్థలమిచ్చిన రైతుల ఇళ్లు కూల్చారు. వైకాపా పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైంది. గుడివాడలో నోరు పారేసుకునే ఎమ్మెల్యే నోరు కట్టడి చేయాలంటే కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాముని గెలిపించాలి. అధికార పీఠం మనదే.. వైకాపా అవినీతి కోటను బద్దలు కొడదాం’’ అని పవన్ పిలుపునిచ్చారు.
వైసీపీ నేతల తిట్లకు పన్ను వేస్తే…
వైసీపీ నేతలు తిట్టినన్ని తిట్లు ఇంకెవరూ తిట్టలేదు. వైసీపీ నాయకులు తిట్టిన ప్రతి తిట్టుకు పన్ను వేస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా విద్య, వైద్య సదుపాయం అందించవచ్చు. రాష్ట్రంలో రోడ్లపై గోతులు, వైసీపీ నేతల నోటి నిండా బూతులు, మొత్తం కేసులు అన్నట్టుగా ఉంది రాష్ట్ర పరిస్థితి అని పవన్ విమర్శించారు.
కూటమి ప్రభుత్వం పక్కా…
ఏపీలో రాబోయే ఎన్నికల్లో కూటమిదే విజయం. జనసేన-బీజేపీ-టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాయి. మెజారిటీ ఎంత అనేది మాత్రమే తేలాల్సి ఉంది. మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి బరిలో ఉన్నారు… గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి ఆయనను పార్లమెంటుకు పంపుదాం. గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నేత వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు… ఆయనకు ఓటేసి గెలిపించాలని పవన్ పిలుపు ఇచ్చారు.