విజయవాడ: మైనారీటీల అభ్యున్నతికి కూటమి మ్యానిఫెస్టో తోడ్పడుతుందని, వారికి అండగా ఉంటామని జనసేనాని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. విజయవాడలో కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా గురువారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. సీఎం ఇంటికి కూత వేటు దూరంలో యువతిపై అత్యాచారం జరిగితే రెండేళ్లు దాటినా నిందితులను ఇంకా పట్టుకోలేదన్నారు. ఇచ్చిన సీపీఎస్ హామీని నిలబెట్టుకోలేని జగన్.. ముస్లిం రిజర్వేషన్లను కాపాడుతామంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దాదాపు 30వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. వారి గురించి జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. హామీలను నెరవేర్చకుండా జగన్ మాట తప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక యువతకు ఉపాధి కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. యువతలో ఉన్న నైపుణ్యం బయటకు తీయాలి. వారి ఆశలు, ఆకాంక్షలు అసెంబ్లీలో వినిపిస్తా’’ అని పవన్ తెలిపారు.
వంగవీటి రాధా సొంతగడ్డ విజయవాడలో జరుగుతున్న సభ కావడంతో ఆయన అభిమానులు ఉత్సాహంగా తరలివచ్చారు. దీంతో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా పిలిచి మరీ రాధాకు మైక్ అందించారు. దాంతో సభకు హాజరైన ప్రజలు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. రాధా తన ప్రసంగాన్ని నేరుగా ముఖ్యమంత్రిని విమర్శించడంతో మొదలుపెట్టారు. జగన్ రెడ్డి మాట్లాడితే బటన్ నొక్కాను అంటున్నారు… అయ్యా మీరెంత నొక్కేశారో కూడా ప్రజలందరికీ చెబితే బాగుంటుంది. తగ్గాను, తగ్గాను అని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఎక్కడ తగ్గారని నేనంటున్నాను. జనసేనాని పవన్ ఒక్క పిలుపు ఇస్తే 175 నియోజకవర్గాల్లో జనసైనికులు అండగా నిలిచారు… అదీ ఆయన సత్తా అన్నారు. కాగా, రాధా ప్రసంగిస్తున్నంత సేపు ప్రజలు నినాదాలతో హోరెత్తించారు. ప్రజల్లో కనిపిస్తున్న ఆ ఉత్సాహాన్ని వేదికపై ఉన్న పవన్ కల్యాణ్ కూడా ఆస్వాదించారు. కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థులు గద్దె రామ్మోహన్, సుజనాచౌదరి తదితరులు పాల్గొన్నారు.