- కక్షగట్టిన జగన్‌ను ఎదిరించి ఐదేళ్లుగా పోరాటం
- పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించేందుకు ప్రభుత్వం కుట్ర
- బాధ్యతలు చేపట్టి సగౌరవంగా పదవీ విరమణ
- పదవికే విరమణ.. పోరాటానికి కాదని స్పష్టీకరణ
అమరావతి(చైతన్యరథం): పోరాట యోధుడు, డీజీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చివరికి సాధించారు. ఐదేళ్ల సుదీర్ఘ పోరాటం.. వ్యవస్థలతో కొట్లాటలో గెలిచారు. కక్షగట్టిన పాలకుడు జగన్‌కు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ చివరకు బాధ్యతలు చేపట్టిన తరువాతనే సగౌరవంగా పదవీ విరమణ చేశారు. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండానే సర్వీసునుండి పంపించేందుకు జగన్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. దీనిపై ఆయన ఎక్కని కోర్టు మెట్లు లేవు. క్యాట్ నుండి సుప్రీంకోర్టు వరకు జగన్ సర్కార్ కక్షసాధింపులపై పోరాడారు. చివరకు గెలిచారు. అన్ని అడ్డంకులనూ అధిగమించి సర్వీసులో చివరి రోజైన శుక్రవారం ఉదయం విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఏబీవీ… సాయంత్రానికి పదవీ విరమణచేశారు.
గత ఐదేళ్లుగా జగన్ సర్కార్ పై ప్రతిపక్ష పార్టీలది ఒకరమైన పోరాటం అయితే ఏబీవీది మరోరకమైన పోరాటం. జగన్ సీఎం కాగానే ఏబీవీపై కక్షసాధింపులు మొదలయ్యాయి. డైరెక్టర్ జనరల్ ర్యాంక్ కలిగిన ఆయనకు ఐదేళ్లుగా పోస్టింగ్ ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించింది. అక్రమ కేసులతో జగన్ ప్రభుత్వం, వైకాపా వీరభక్త అధికార గణం వేధించింది. జగన్ అధికారంలోకి వచ్చాక రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయించారు. దీనిపై ఏబీవీ.. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను (సీఏటీ) ఆశ్రయించగా సస్పెన్షన్‌ను సమర్థించింది. అనంతరం ఆయన హైకోర్టుకు వెళ్లగా.. ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్లో ఉంచొద్దని ఆదేశిస్తూ.. ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు రెండేళ్ల క్రితం పోస్టింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏ కారణంతో సస్పెండ్ చేశారో.. తిరిగి అదే కారణంతో మరోసారి సస్పెండ్ చేసింది. దీనిపై ఏబీవీ మరోసారి క్యాట్‌ను అశ్రమించారు. ఏబీవీ సస్పెన్షన్ చెల్లదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ ఈ నెల 8న ఆదేశాలిచ్చింది. ఈ నెల 31న ఏబీవీ పదవీ విరమణ చేయాల్సి ఉండగా, పోస్టింగ్‌పై ప్రభుత్వం తాత్సారం చేసింది. క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉత్తర్వులిచ్చింది. ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను సీఎస్ జవహర్రెడ్డికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలోనూ స్వయంగా ఏబీ వెంకటేశ్వరరావే అందజేశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఆయనను సర్వీసులోకి తీసుకుంటూ శుక్రవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించి, సాయంత్రం విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కార్యాలయంలో పదవీ విరమణ చేశారు.
బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో ఛార్జ్ తీసుకుంటున్నా. నాకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు. ఇవాళ నా పదవీ విరమణ రోజు.. ఈ రోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నా. సాయంత్రం పదవీ విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. కారణాలు ఏమైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా.. ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పోస్టింగ్ ఆర్డర్లు వచ్చాయి.. విధుల్లో చేరాను. ఇప్పటికి ఇంత వరకు మాత్రమే మాట్లాడాలి. ఇంతకాలం నాకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యావాదాలు. యూనిఫాంతో పదవీ విరమణ చేయడంతో నా కల నెర వేరినట్లుగా భావిస్తున్నా అని ఏబీవీ తెలిపారు.
జగన్ ఎవరిపైనైనా కక్షగడితే అది ఏవిదంగా ఉంటుందో అర్దం చేసుకునేందుకు ఏబీ వేంకటేశ్వర రావు ఒక ప్రత్యక్ష నిదర్శనంగా ఉన్నారని పలువురు అభిప్రాయపడ్డారు. పోలీసుశాఖలో డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు డీజీపీ కాకుండానే రిటైర్ అయ్యారు. ఆయన అభిమానులు, ఉద్యోగులు భారీగా తరలివచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. ఐపీఎస్ అధికారిగా ఆయన చేసిన సేవలు, ధైర్య సాహసాలను పలువురు కొనియాడారు. సీనియర్ ఐపీఎస్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్, తెదేపా నేత పట్టాభి, అమరావతి ఐకాస నేతలు సహా పలువురు ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు ఏబీవీని కలిసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసిన ఆత్మీయులను హత్తుకున్న ఏబీవీ.. ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. పోలీసు యూనిఫాంతో ఉన్న ఏబీవీ ఫొటోపై ఫైటర్ అని రాసిన ప్రకార్డులను ఆయన అభిమానులు ప్రదర్శించారు.
పదవీ విరమణ అనంతరం ఏబీవీ మాట్లాడుతూ తాను ఇంజినీరింగ్ చదువుకుని తొలుత టాటామోటార్స్‌లో ఉద్యోగం చేశానన్నారు. అదే సంస్థలోలో ఉన్నా.. లేక అమెరికా వెళ్లినా.. ఇప్పుడు నా జీవితం వేరే విధంగా ఉండేది. ఐపీఎస్‌గా అధర్మాన్ని, అన్యాయాన్ని, అణచివేతను ఎదుర్కోవడం నా వృత్తిధర్మంగా పనిచేశాను. నా సర్వీసులో చట్టాన్ని కాపాడేండేందుకు అక్రమాలను, అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు పాటుపడ్డాను. అన్యాయాన్ని ఎదుర్కొన్నా తప్పితే నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. నేను ఈ రోజు పూర్తి సంతృప్తితో రిటైర్ అవుతున్నాను. నా సర్వీసులో నీతి నిజాయితీతో వ్యవహరించాను. ఎవరికీ అన్యాయం చేయకపోవడంతోనే ఈరోజు నేను లక్షల మంది అభిమానం పొందాను. నాకు ఎదురైన సవాళ్లు, కష్టాలు చూసి నా అభిమానులు ఉద్వేగ్వంతో ఏడ్చారు. నా నిజాయితీ, ధర్మం, పోరాటమే నన్ను కాపాడిరది. నా సర్వీసులో దుర్మార్గులనూ చూశా.. అదే సమయంలో నాకు వ్యతిరేకంగా వ్యవహరించాలని ఎంత డబ్బు ఆశ చూపినా కొందరు అధికారులు అంగీకరించలేదు. నాకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రిటైర్ అయినా నా జీవితం ఉన్నంతవరకు ప్రజా సేవలో ఉంటాను. నా శేష జీవితంలోనూ అన్యాయాన్ని, అణచివేతను ఎదురిస్తా. దుష్ట శిక్షణ-శిష్టరక్షణ చేసేందుకు నా రిటైర్డ్ జీవితంలో అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. నాకు ఆప్తులుగా ఉండి అండగా ఉన్న వారికి రుణపడి ఉంటానన్నారు.