- భారీ ఓటమితో దిగాలు
- పదవికి రాజీనామా.. గవర్నర్‌కు లేఖ
- జోక్‌గా మిగిలిన ‘వైనాట్ వన్ సెవెంటీఫైవ్’
- దేశం షాక్ తిందంటూ.. జగన్‌పై సెటైర్లు
అమరావతి (చైతన్య రథం): సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వైసీపీకి అశనిపాతమయ్యాయి. ఫలితాలు ఇలా వస్తాయని అనుకోలేదని, ఆశ్చర్యానికి గురి చేశాయని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకు, అవ్వతాతలకు, యువతకు, రైతుకు ఎంతో చేశాం. వాళ్ల కష్టం మా కష్టమనుకున్నాం. కోట్ల ప్రజలకు వైసీపీ ఎంతో సంక్షేమం అందించాం. అంతమంది ప్రేమానురాగాలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలీదు’ అంటూ జగన్ బేలమాటలకు పరిమితమయ్యారు. ‘వైనాట్ వన్ సెవెంటీఫైవ్’ నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్ టీం.. పోటెత్తిన పోలింగ్ కూటమికే అనుకూలమంటూ రాష్ట్రం మొత్తం నిర్థారణకు వచ్చినపుడూ నిబ్బరాన్నే ప్రదర్శించారు. కోర్టు అనుమతితో లండన్ టూర్‌కి వెళ్తూ కూడా జగన్.. దేశాన్ని నిభిడాశ్చర్యానికి గురి చేసే ఎన్నికల ఫలితాలే రాబోతున్నాయని, వైసీపీ భారీ గెలుపుతో అంతా షాక్‌కి గురవుతారని గట్టిగానే వ్యాఖ్యానించారు. కూటమి భారీ గెలుపు ఖాయమంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడైనపుడూ.. వైసీపీ నేతలెవ్వరూ వీసమంత కంగారు కూడా ప్రదర్శించలేదు. అయితే, ముందు జగన్ ప్రకటించినట్టుగానే దేశం మొత్తాన్ని షాక్‌కు గురి చేస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
కాకపోతే.. కూటమి దిగ్విజయం సాధించింది. దీంతో, వైసీపీ శిబిరం మొత్తం సైలెంటైపోయింది. నేతలెవ్వరూ ఒక్కమాట కూడా మాట్లాడకుండా.. రహస్య ప్రదేశాలకు వెళ్లిపోయారు. భారీ ఓటమితో సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేశారు. జగన్ తన రాజీనామా లేఖను గవర్నరుకు పంపించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఘోర ఫలితాలను చవిచూడటంతొ, జగన్ మాత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇలాంటి ఫలితాలను అసలు ఊహించలేదంటూ దిగాలుగా ప్రకటించారు. అక్క చెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. పింఛన్లు అందుకున్న అవ్వా తాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. ‘ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నాం. పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యాం. 54 లక్షలమంది రైతులకు పెట్టుబడి సాయం చేశాం. రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకున్నాం. అరకోటి రైతన్న ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదు.
డ్వాక్రా మహిళలు, ఆటో డ్రైవర్లు, గీత కార్మికులు, రాజకుమాలకు, నాయీబ్రాహ్మణులకు, మత్స్యకారులకు అండగా ఉన్నాం. ఇన్ని కోట్లమందికి ఎంతో మేలు చేసినా ఓడిపోయాం. మ్యానిఫెస్టో హామీలను 99 శాతం అమలుచేశాం. పేద పిల్లల చదువుల కోసం ఎంతో సాయం చేశాం. గ్రామాల్లో ఎన్నడూ చూడని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాం. నిబద్ధతగల ప్రభుత్వంగా పని చేశాం. 2.7లక్షల కోట్ల రూపాయలు ఇంటివద్దకే అందించాం. అయినా, ప్రజల తీర్పును తీసుకుంటాం. మంచి చేయడానికి ఎప్పుడూ ముందుంటాం. పేదవాడికి అండగా ఉంటూ గళం విప్పుతాం. పెద్దవాళ్ల కూటమిలోని భాజపా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు అభినందనలు. ఎన్నిచేసినా మా ఓటు బ్యాంకును 40 శాతానికి తగ్గించలేకపోయారు. ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొని ముందుకుసాగుతాం’ అని జగన్ వ్యాఖ్యానించారు.