న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవశకం దిశగా నడిపించేందుకు సంపూర్ణంగా కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గన్నవరం వద్ద జరిగిన చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మోదీ నూతన ప్రభుత్వానికి ఆశీస్సులు అందజేశారు. అనంతరం మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యాను. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబుకు, మంత్రులుగా ప్రమాణం చేసిన ఇతరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏపీకి ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు, మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉంది. యువత ఆశలను ఈ ప్రభుత్వం నెరవేర్చుతుందని స్పష్టం చేశారు.