- ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపుపై రెండో సంతకం
- సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రి సవిత
- వారంలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి
- త్వరలో బీసీ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి
అమరావతి: రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందించే ఫైల్పౖౖె రాష్ట్ర వెనకబడిన తరగతుల సంక్షేమం, ఈడబ్ల్యుఎస్, చేనేత, జౌళి శాఖల మంత్రి సంజీవిరెడ్డిగారి సవిత తొలి సంతకం చేశారు. రాష్ట్ర సచివాలయం నాల్గవ బ్లాక్‌లో గురువారం ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బీసీ స్టడీ సర్కిళ్ళలో ఉచిత డీఎస్సీ కోచింగ్, ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపు పథకాలపై మొదటి, ద్వితీయ సంతకాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారని, ఆయన అడుగుజాడల్లో వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్‌పై తాను తొలి సంతకం చేశానని సవిత పేర్కొన్నారు.
అదే విధంగా 2014-19లో 2173 మందికి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించిన ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని కొనసాగించనున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 2014-19 లో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ల నిర్మాణాలను సైతం పూర్తి చేస్తామన్నారు. చేనేత కళాకారులు, హస్త కళాకారులకు తగిన సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వారానికి ఒక్కసారైనా సచివాలయ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ కులానికి చెందిన మహిళకు వెనకబడిన తరగతుల మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. విభజన నాటికి రాష్ట్రంలో ఉన్న 32 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను 106 కి పెంచిన ఘనత చంద్రబాబు నాయుడిదే అన్నారు. రాష్ట్రం బాగుండాలనే తపన కలిగిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. దేశానికి బీసీ నాయకుడు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో తనకు బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమం, ఈడబ్ల్యుఎస్ సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంత రాము, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె. సునీత, ఆ శాఖ కమిషనర్ ఎమ్.ఎమ్ నాయక్, బీసీ కార్పొరేషన్ ఎండి జి.సి. కిషోర్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కృష్ణ మోహన్, బీసీ సంఘాల నాయకులు, చేనేత కళాకారులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సవిత ముఖ్య కార్యదర్శి సునీతతో కలిసి మూడవ బ్లాకులోని లేపాక్షి ఎంపోరియంను సందర్శించారు