- ప్రమాణ స్వీకారవేళ సభలో ఉద్విగ్న వాతావరణం
- శపథం నెరవేర్చుకుని గౌరవ సభలో అడుగుపెట్టిన టీడీపీ అధినేత
- పవన్, లోకేష్ ప్రమాణ స్వీకారంతో పులకించిన అభిమానులు
- జగన్‌కు ప్రోటోకాల్‌కి మించి ప్రాధాన్యత..చంద్రబాబు ఔదార్యం
- తొలిరోజు 172 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం
అమరావతి(చైతన్యరథం): అధినేత శపథం నెరవేర్చుకుని ముఖ్యమంత్రి హోదాలోనే తిరిగి శాసనసభలో అడుగుపెడుతున్నారని టీడీపీ సభ్యులందరిలో ఉద్విగ్నత, ముఖాల్లో పట్టరాని సంతోషం, ఉల్లాసభరిత వాతావరణంలో జయజయధ్వానాల మధ్య నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి శాసనసభలో అడుగుపెట్టారు. ఉండవల్లిలోని తన నివాసం నుండి శుక్రవారం ఉదయం బయలుదేరి తొలుత వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం శాసనసభకు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి నమస్కారం చేశారు. ఈ భావోద్వేగ సన్నివేశంతో అనేక మంది ఎమ్మెల్యేలు కదిలిపోయి హర్షధ్వానాలు చేశారు. అసెంబ్లీ లోపలికి చంద్రబాబుకు పూర్ణ కుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. తన ఛాంబర్ లోకి వచ్చిన వెంటనే.. చంద్రబాబుకు పండితులు ఆశీర్వచనం పలికారు. అనంతరం గౌరవ సభలోకి సీఎం చంద్రబాబు అడుగు పెట్టగానే.. కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది’ అంటూ తెదేపా ఎమ్మెల్యేలు ప్రకార్డులు ప్రదర్శించారు. సభలోకి అడుగుపెట్టిన వెంటనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలయింది.
శాసనసభలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నారా లోకేష్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, డోలా బాల వీరాంజనేయస్వామి, బీసీ జనార్దన్‌రెడ్డ్డి, ఎస్ సవిత, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేష్, ఎన్‌ఎండీ ఫరూక్, పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి, మండిపల్లి రామప్రసాదరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వాసంసెట్టి సుభాష్‌తో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మిగతా సభ్యులు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు.. చంద్రబాబు దగ్గరకు వెళ్లి కృతజ్ఞతతో నమస్కరించారు. కొందరైతే పాదాభివందనం కూడా చేశారు. చంద్రబాబుతో పాటు, పవన్, లోకేష్ దగ్గరకూ వెళ్లి సభ్యులు నమస్కరించారు. సభలో మొత్తం 175 మంది సభ్యులకు గాను తొలిరోజు 172 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వేరువేరు కారణాలతో ముగ్గురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.
ప్రజాక్షేత్రంలో బదులు తీర్చుకుని..
సరిగ్గా 2021 నవంబర్ 19న సాక్షాత్తూ శాసనసభలో తన సతీమణిని అవమానించి మాట్లాడటంతో చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసెంబ్లీలో కొందరు వైసీపీ సభ్యులు మాట్లాడటం, సభా నాయకుడిగా వారించాల్సిన అప్పటి సీఎం జగన్ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించడంతో చంద్రబాబు ఆ రోజు తీవ్ర మనస్తాపం చెందారు. నాటి చంద్రబాబు అవేదన, కన్నీటిని కూడా వైసీపీ నేతలతో పాటు జగన్‌రెడ్డి సైతం హేళన చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రబాబు కౌరవ సభను గౌరవ సభగా చేసి తిరిగి ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడగు పెడతానని శపథం చేసి వెళ్లిపోయారు. ఇన్నేళ్లూ పరువు కోసం బతికాను.. అలాంటిది ఈ రోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు.. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ.. ఇలాంటి సభలో నేనుండను.. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను.. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు.. మీ అందరికీ ఓ నమస్కారం.. అని చంద్రబాబు తీవ్ర అవమానభారంతో భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు నుంచీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేదు. ప్రజాక్షేత్రంలోనే వైసీపీపై బదులు తీర్చుకుని, ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెట్టారు.
లోకేష్‌ను ఆశీర్వదించిన బాలయ్య
మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్‌ను నిండు సభలో ఆయన మామ, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆశీర్వదించటం హైలెట్‌గా నిలిచింది. సభలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ.. లోకేష్ స్థానం వద్దకు వెళ్లి తలమీద చెయ్యివేసి నిండు మనసుతో అశీర్వదించారు. లోకేష్ కూడా ముకుళిత హస్తాలతో వినమ్ర పూర్వకంగా బాలయ్య ఆశీర్వాదం స్వీకరించారు.
కోట్లమందికి భావోద్వేగం
ఈసారి అసెంబ్లీలో కొన్ని దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిపోయాయి. అవి కోట్లమందికి భావోద్వేగాన్ని కలిగించాయి. అన్న మాట ప్రకారమే చంద్రబాబు మళ్లీ సీఎంగా సభకు రావడం, ప్రమాణ స్వీకారం చేయడంతో టీడీపీ ఎమ్మెల్యేలు, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న కోట్లాది అభిమానులు పులకరించిపోయారు.
అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా ఆయన అభిమానులకు ఎంతో ఉద్వేగానికి గురిచేసింది. జనసేన పార్టీ పెట్టి పదేళ్లు దాటిపోగా.. ఇన్నాళ్లకు పవన్ ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014లో ఆయన పోటీయే చేయలేదు. 2019లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో వైసీపీ నుంచి ఆయన ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో తెలిసిందే. పవన్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమంటూ పలువురు వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. అయితే పవన్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించడమే కాదు.. డిప్యూట్ చీఫ్ మినిస్టర్ అయి ఐదు మంత్రిత్వ శాఖలను నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ప్రమాణ స్వీకారం దృశ్యాలు జనసైనికులకు తీవ్ర భావోద్వేగాన్ని కలిగించాయి.
పవన్‌లాగే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవకపోడంపై వైసీపీ నుంచి ఎన్నో మాటలు పడ్డ నారా లోకేష్ సైతం భారీ మెజారిటీతో నెగ్గి అసెంబ్లీలో అడుగు పెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా తెలుగుదేశం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది.
కూటమి అభిమానుల పరిస్థితి ఇలా ఉంటే.. వైసీపీ వాళ్లకు మాత్రం శుక్రవారం నాటి దృశ్యాలు ఎంతమాత్రం మింగుడుపడనివే. ఇదే సభలో ఐదేళ్లు ఎక్కడలేని అహంకారం ప్రదర్శించిన జగన్.. ఈసారి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో సభలో అడుగు పెట్టడం.. ప్రమాణ స్వీకారం సమయంలో పేరు కూడా సరిగా పలకలేక తడబడడం.. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సభలో ఉండకుండా తన ఛాంబర్‌కు వెళ్లిపోవడం.. చర్చనీయాంశంగా మారింది.
జగన్‌కు ప్రోటోకాల్‌కు మించి ప్రాధాన్యత!
కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోమని ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా వ్యవహరిస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం అందుకు అనుగుణంగానే వ్యవహరించింది. ఈమేరకు అసెంబ్లీ ప్రాంగణంలోకి మంత్రుల వాహనాలతో సమానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వాహనాన్ని అనుమతించేందుకు సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం జగన్ రెడ్డి ఓ సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ఇటీవలి ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ప్రోటోకాల్ ప్రకారం జగన్ రెడ్డి వాహనానికి అనుమతి ఉండదు. కానీ, మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు గౌరవమిస్తూ.. గేటు దాటి అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించినట్లు శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రి పయ్యావుల తెలిపారు. దీంతో వైసీపీ సర్కార్ వ్యవహరించినట్టుగా కక్ష సాధింపులు ఉండవని ప్రకటించినట్లునే కూటమి ప్రభుత్వం జగన్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. అదే విధంగా మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన తరువాత జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించి సీఎం చంద్రబాబు మరోసారి ఉదారత చాటుకున్నారు. మామూలు ఎమ్మెల్యేగా అయితే అక్షర క్రమంలో ఆయన పేరు ఎప్పుడు వస్తే జగన్‌రెడ్డి అప్పుడు ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చేది. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు అసెంబ్లీకి వచ్చిన జగన్ రెడ్డి సభలో తలెత్తుకునేందుకు కూడా ఇష్టపడకపోవడం గమనార్హం. ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వద్దకు వెళ్లి నమస్కరించి మాట్లాడిన జగన్.. ఆయన కళ్ళలోకి కూడా సరిగా చూడలేక తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒకప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అధికారగర్వంతో విర్రవీగిన జగన్.. నేడు కేవలం తనతో సహా 11మందితో సభకు వెళ్లాల్సిన కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారు.