అమరావతి: సీజనల్ వ్యాధుల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధుల కట్టడిపై అసెంబ్లీ కమిటీ హాల్‌లో శుక్రవారం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, పురపాలకశాఖ మంత్రి నారాయణ, సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితరులు హాజరయ్యారు. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు వ్యవహరంపై అధికారులను పవన్ నిలదీశారు. స్థానిక సంస్థలకు నిధులు ఎందుకు ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ నిధులను సీఎఫ్‌ఎంఎస్ ఖాతాకు ఎంత మేర మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విజయవాడలో డయేరియా కేసులు ఉత్పన్నం కావడానికి తాగునీటి సరఫరాలో లోపాలే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. మలేరియా సహా వివిధ రకాల అంటువ్యాధుల నివారణ, నీటి ద్వారా సంక్రమిత వ్యాధుల నియంత్రణ, సంసిద్ధత పై మంత్రులు, అధికారులతో చర్చించారు.