అమరావతి (చైతన్యరథం): ‘ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజామోదం పొంది సభలో కొలువు తీరిన వారంతా శాసనాలు రూపొందించడానికే తప్ప ఉల్లంఘించడానికి కాదు. అసెంబ్లీలో వాదోపవాదాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో సాగడం, ఆమోదం పొందడం ప్రజాస్వామానికి మౌలిక పునాదులు. వాదోపవాదాలు చర్చను మరింత ఉన్నత దశకు తీసుకెళ్లేలా ఉండాల’ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు విజయాన్ని తీసుకున్నత సులభంగా ఓటమిని తీసుకోలేకపోయారు, అందుకే ప్రజా సమస్యలను పూర్తిస్థాయిలో చర్చించే శాసనసభకు మొదటి రోజే హాజరు కాలేదన్నారు. ప్రజా సమస్యలు వినిపించేందుకు వేదికైన గౌరవ శాసనసభను గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలు, బూతులతో అగౌరవపరిచింది. అందుకే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ 16వ శాసన సభాపతిగా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పవన్ కళ్యాణ్ తొలిసారి శాసనసభలో ప్రసంగించారు. ‘అయ్యన్న పాత్రుడు సుదీర్ఘ రాజకీయానుభవమున్న వ్యక్తి. సాంకేతిక విద్య, రోడ్లు భవనాలు, అటవీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పని చేయడమే కాదు, పార్లమెంటులో ఉత్తరాంధ్ర గొంతు వినిపించారు. అలాంటి వ్యక్తి స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. ఇన్ని దశాబ్దాల్లో ఆయనలోని వాడి, వేడి, ఘాటైన వాగ్దాటిని ప్రజలు చూశారు. ఇకపై ఆయన హుందాతనాన్ని రాష్ట్ర ప్రజలంతా చూస్తారన్నారు.
భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు
గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసింది. భాషా నియంత్రణ శాసన సభ నుంచే మొదలు కావాలి. సభాపతి ఆ బాధ్యత తీసుకోవాలి. ఆడబిడ్డలు గత ప్రభుత్వ హయాంలో నలిగిపోయారు. ఏదైనా ప్రజా సమస్య మీద మాట్లాడితే సోషల్ మీడియాలో వ్యక్తిగత జీవితాలపై బురదజల్లే వారు. మీ హయాంలో అలాంటి చర్యలు ఆగిపోవాలి. చర్చల్లో సంస్కారహీనమైన భాష, భావాలు ఉండకూడదని కోరుకుంటున్నానని పవన్ విజ్ఞప్తి చేశారు. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదని, భాష మనుషులను కలపడానికే తప్ప విడగొట్టడానికి కాదన్నారు. భాష సమస్యలను పరిష్కరించడానికి తప్ప విద్వేషాలు రేపడానికి కాదు. ఎంతటి జటిలమైన సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించవచ్చని ప్రస్తుత సభ నిరూపించాలన్నారు. భావాన్ని బలంగా తెలియజేయాలంటే దానిలో అసభ్యత లేకుండా మానవీయతతో ప్రజలందరికీ అర్ధమయ్యేలా చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు ఈ సభ భవిష్యత్‌కు ప్రామాణీకం కావాలని, రాష్ట్ర దిశ మార్చే వేదిక కావాలన్నారు. తన ప్రసంగంలో అయ్యన్నపాత్రుడు ప్రసంగ శైలిని ఉద్దేశించి పవన్ ఛలోక్తులు సభలో నవ్వులు పూయించాయి. ‘మీకు కోపం వస్తే రుషికొండను చెక్కినట్లుగా ఉత్తరాంధ్ర యాసలో పదునైన మాటలతో ప్రత్యర్థులకు గుండు కొట్టేస్తారు’ అంటూ వ్యాఖ్యానించటంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి.