న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బుధవారం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిని అప్యాయంగా పలకరించి మాట్లాడారు. రాబోయే ఐదేళ్లూ రాష్ట్రంలో, కేంద్రంలో టీడీపీ, బీజేపీ కలిసి పని చేస్తాయని చెప్పారు. నా మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో కలిసి పని చేస్తామని ప్రధాని అన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. అంతకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. టీడీపీ ఎంపీలతో అరగంట పాటు మాట్లాడారు. పార్లమెంట్ ఒక విశ్వవిద్యాలయం అని, పార్లమెంట్‌లో ఎంత ఎక్కువసేపు గడిపితే అంత ఎక్కువ నేర్చుకుంటారని ఎంపీలకు సూచించారు. ఏపీలో ఎన్డీయేకి మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు.
మీరంతా కష్టపడి పని చేసి ఏపీకి, దేశానికి మంచి పేరు వచ్చేలా నడుచుకోవాలి. మీకు ఇష్టమైన అంశాలపై పార్లమెంట్ చర్చల్లో పాల్కొనాలని ఎంపీలతో మోదీ అన్నారు. ఇక డిబేట్‌లలో పాల్కొనేటప్పుడు రీసెర్చ్ చేసి మాట్లాడితే అందరి మన్ననలు పొందుతారని మోదీ సూచన చేశారు. మీకు నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. ఒక ఫోన్ చేస్తే చాలు. నేను అందుబాటులో లేకపోయినా నా కార్యాలయ అధికారులు నోట్ చేసుకుంటారు. సమయం చూసుకొని నేను మళ్లీ మీకు ఫోన్ చేస్తానని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, బైరెడ్డి శబరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడు, తదితరులు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు.