- 18 రోజుల్లోనే పింఛన్లు పెంచి మాట నిలబెట్టుకున్న చంద్రన్న
- పెంచిన పింఛన్, బకాయిలతో రూ. 7000 ఇంటివద్దకే ఇవ్వడం గొప్ప విషయం
- చంద్రబాబు మార్క్ చూపేలా 1నే ఉద్యోగులకు జీతాలు
- నాయకుడికి, నేరస్ధుడికి తేడా గమనిస్తున్న ప్రజలు
- రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరిగెడుతుంది
- మాజీమంత్రి జవహర్ ఉద్ఘాటన
అమరావతి(చైతన్యరథం): అధికారంలోకి వచ్చిన 18 రోజుల్లోనే ఇచ్చిన హామీని అమలు చేసి, దేశ చరిత్రలో నిలిచిపోయేలా పింఛన్ల పండుగకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థతపైనా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో జగన్ రెడ్డికి రూ. 1000 పెంచడానికి ఐదేళ్లు పడితే… చంద్రబాబు అధికారం చేపట్టిన 18 రోజుల్లోనే పెంచిన వెయ్యితో పాటు ఇస్తానన్న బకాయిలతో ఇంటివద్దకే రూ. 7000 తెచ్చి ఇచ్చి పండుటాకుల జీవితాల్లో పండుగ తెచ్చారన్నారు. ఎన్నికల సందర్భంగా నాడు వాలంటీర్లను ఎన్నికల సంఘం పక్కన బెడితే, సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటివద్దనే పింఛన్ ఇచ్చే వీలున్నా జగన్ రెడ్డి ప్రభుత్వం ఆ విధంగా ఇవ్వకుండా కుట్రపూరితంగా లబ్ధిదారులైన వృద్ధులను ఎండల్లో తిప్పి 60 మంది ప్రాణాలు తీశాడని మండి పడ్డారు. ఆ శాపమే జగన్ రెడ్డిని వెంటాడిరదని పేర్కొన్నారు. ఎండలో వృద్ధులను తిప్పి వారి మరణానికి కారమైన జగన్ రెడ్డి తక్షణమే వృద్ధులకు క్షమాపణ చెప్పాలి. ఎన్నికల లబ్ధికోసం జగన్ రెడ్డి శవరాజకీయాలు చేశాడు. గతంలో ఒక్క ఛాన్స్ అంటే జనం, ఉద్యోగస్తులు మోసపోయి అధికారం ఇచ్చారన్నారు. అధికారం ఇచ్చిన జనానికే జగన్ రెడ్డి వాత పెడితే వారు మళ్లీ చంద్రన్న పాలనను కోరుకుని అఖండ మెజార్టీని అందించారని జవహర్ తెలియజేశారు.
తొలిరోజునే 95.5 శాతం పింఛన్లు పంపిణీ
రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలా జరిగింది. వాలంటీర్లు లేకుంటే పింఛన్‌లు ఇవ్వలేనని చెప్పిన అసమర్థుడు జగన్ రెడ్డి. నేడు సచివాలయాల ఉద్యోగులు, ఇతర ఉద్యోగులతో ఒక్క రోజే 95.5 శాతం పింఛన్లు పంపిణీ చేశాం. పింఛన్ల పంపిణీ పెంపు చారిత్రాత్మకమైన విషయం. రౌతు కొద్దీ గుర్రం అన్నట్లు రాష్ట్రంలో పాలనను చంద్రబాబు గాడిలో పెట్టి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. పింఛన్ దారులకు నేడు చంద్రబాబు దేవుడిలా ఉన్నారు. పేదల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందించిన ఆపద్బాంధవుడు చంద్రబాబు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా అన్న ఎన్టీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో పింఛన్ విధానం తీసుకు వస్తే, దాన్ని చంద్రబాబు పెంచి పేదలకు భరోసా కల్పించారు. పింఛన్ పెరుగుదలలో మిగిలిన ముఖ్యమంత్రులందరూ కలిసి కేవలం రూ.1200 వరకు మాత్రమే పెంచితే.. చంద్రన్న ఒక్కడే రూ. 2,845 పెంచారని జవహర్ చెప్పారు.
బరువు కాదు, బాధ్యత
వృద్ధులు, పేదలు, వితంతువులు, వికలాంగులు ప్రభుత్వానికి బరువు కాదని, బాధ్యత అని చంద్రబాబు నిరూపించారు. పెంచిన పింఛన్‌ను బకాయిలతో కలిపి నేరుగా ఇంటికే రూ.7000 తెచ్చి ఇవ్వడం హర్షణీయం. ఆసరాకోసం, భరోసా కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి పండుగరోజులా పింఛన్ల పంపిణీ జరిగింది. గత ఎన్నికలకు ముందు పింఛన్ రూ.3000లకు పెంచుతానని చెప్పి, అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి మోసం చేశాడు. రూ.250 చొప్పున పెంచుకుంటూ రూ.1000 పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకున్నాడు. పింఛన్ లబ్ధిదారుల శాపంతోనే జగన్ రెడ్డి 11 సీట్లకు పడిపోయాడు. చంద్రబాబు గతంలో ఎన్నడూ లేనంత ఫిట్‌మెంట్ ఇచ్చి ఉద్యోగులకు తోడుగా ఉన్నా.. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి మోసపోయిన ఉద్యోగులు జగన్‌రెడ్డికి ఓట్లు వేసి వాత పెట్టించుకుని అనుభవించారు. ఇతర ప్రయోజనాలు సరే.. ఒకటో తేదీన జీతాలు పడితే చాలనే స్థితికి జగన్ పాలనలో ఉద్యోగులు పరిస్థితి వచ్చింది. 20వ తేదీ వచ్చినా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బంది పెట్టాడు.
రాష్ట్రానికి మంచిరోజులు
1వ తేదీనే జీతాలు ఇస్తారనే బ్రాండ్ చంద్రబాబుకు ఉంది. ఆ విధంగానే 1నే జీతాలు చెల్లిస్తాం, మరోవైపు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 1వ తారీఖునే జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నించడం ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయనేందుకు సంకేతం. కూటమి ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు మెరుగుబడబోతున్నాయి. పరిశ్రమలకు అనువుగా ఉండే పరిస్థితి రాబోతుంది. అమరావతి రాజధానితో సంపద సృష్టించి ఏ విధంగా సంక్షేమానికి పంచాలో చంద్రబాబుకు తెలుసు. ఒక నేరస్తుడికి ఒక నాయకుడికి అప్పుడే తేడా కనిపిస్తుంది. 2019 ముందు అందరూ జగన్ రెడ్డి సీఎం అయితే బాగుండు అనుకున్నారు. ఆయన పాలన చూశాక చంద్రబాబు పాలనను కోరుకున్నారు. చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ప్రజలు ఒకే విధంగా తీర్పు ఇచ్చిన చరిత్ర ఏనాడు లేదు.
అన్ని హామీలు అమలుచేస్తాం
వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగంతోపాటు పోలవరం నిర్మాణాన్ని కూడా చంద్రబాబు గాడిలో పెట్టబోతున్నారు. అన్ని రంగాలను గాడిలో పెట్టడం చంద్రబాబుకే సాధ్యం. జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు ఇక నమ్మబోరు. జగన్ రెడ్డిని నమ్మి నష్టపోయిన వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందరి కన్నా భావితరం ఎక్కువగా నష్టపోయింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరిగెత్తుతుంది. మిగిలిన హామీలు కూడా ఒక్కొక్కటిగా అమలవుతాయి. 18 రోజుల్లో పింఛన్ హామీని అమలు చేసిన చంద్రబాబును అభినందిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉందని జవహర్ స్పష్టం చేశారు.