- మేయర్‌పై విచారణ జరిపిస్తామని వెల్లడి
- నోరు మెదపని ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు
కడప: నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశం రసవత్తరంగా జరిగింది. ముందుగా కడప ఎమ్మెల్యేగా తొలిసారి సమావేశంలో పాల్గొన్న మాధవి రెడ్డిని కార్పొరేటర్లందరూ రాజకీయాలకు అతీతంగా ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. డిప్యూటీ మేయర్ షేక్ ముంతాజ్ బేగం అధ్యక్షతన సమావేశాన్ని ప్రారంభిం చారు. కార్పొరేటర్లు వైసీపీకి చెందిన వారైనప్పటికీ పాకా సురేష్, రాచమల్లు బాలస్వామిరెడ్డి తమ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని మాట్లాడకుండా ప్రతిపక్ష పాత్ర పోషించారు. అయితే గతంలో జరిగిన నగర అభివృద్ధిపై కమిషనర్ ప్రవీణ్ చంద్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంలో మేయర్ ఆధ్వర్యంలో నిధులు దుర్వినియోగం అయినట్లు తమ దృష్టికి వచ్చిందని… దానిపై విచారణ జరిపి వెలికితీస్తామని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రకటించారు. 2020-21, 2021`22, 2022`23 సంవత్సరాలకు చెందిన 14, 15 ఫైనాన్స్ గ్రాంట్ కింద విడుదలైన నిధుల వినియోగం, జరిగిన అభివృద్ధి పనులను ఉద్దేశిం చి చర్చను లేవనెత్తారు. అంతేకాకుండా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థపైనా చర్చ రసవత్తరంగా సాగింది.
పింఛన్ల పంపిణీకి పిలవలేదన్న టీడీపీ కార్పొరేటర్
వృద్ధులు, వికలాంగుల పింఛన్లు పంపిణీకి తననెందుకు పిలవలేదని 49వ డివిజన్ కార్పొరేటర్ జి.ఉమాదేవి ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే పిలవడా నికి అక్కడ జరిగింది పెళ్లి కాదని… అసలు పిలవాల్సిన అవసరం లేదని చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో కమిషనర్ జోక్యం చేసుకుని సమావేశంలో చర్చించాల్సిన అంశాలను చెప్పాలని సూచించారు. నగర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని కార్పొరేటర్లు తెలిపారు. కడప నగరానికి ప్రత్యేక స్థానం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఇంజనీర్లు, కార్పొరేట ర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.