- చర్చల ద్వారానే పరిష్కరించుకుందామని సీఎంల నిర్ణయం
- సమస్యలపై రెండు కమిటీల ఏర్పాటుకు నిర్ణయం
- మంత్రులతో ఒకటి, అధికారులతో మరోటి
- నిర్దిష్ట కాలవ్యవధిలో సమస్యల పరిష్కారం
- సామరస్య పూర్వకంగా చర్చలు
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం దిశగా తొలి అడుగు పడిరది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో శనివారం దాదాపుగా రెండు గంటల పాటు జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో రెండు కమిటీలు వేసి సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. శాఖలవారీగా చర్చల కోసం అధికారులతో మరో కమిటీ వేస్తారు. ఆ తరువాత ఇరు రాష్ట్రాల మంత్రులతో ఉప సంఘం వేయాలని నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలం సాగదీయకుండా నిర్దిష్ట కాలవ్యవధి పెట్టుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. సామరస్య పూర్వకంగా జరిగిన ఈ భేటీలో పది కీలక అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు.
పెండిరగ్ సమస్యల పరిష్కారంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. అధికారుల సూచనలు తీసుకున్నారు. న్యాయపరమైన చిక్కులపై కూడా చర్చించారు. షెడ్యూల్ 10లోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వకంగా చర్చ సాగింది. తొలిభేటీలోనే అద్భుతాలు జరుగుతాయని ఎవరూ అనుకోలేదు. కానీ ఓ రూట్ మ్యాప్ ఏర్పడుతుందని మాత్రం భావించారు. అందుకు అనుగుణంగానే సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలు వేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఏదో జరిగిపోతుందని, దానిపై రచ్చ చేద్దామని చూసిన బీఆర్‌ఎస్ నేతలకు మాత్రం నిరాశే మిగిలింది. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బి.సి. జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర అధికారులు హాజరయ్యారు.
ప్రధానంగా చర్చించిన అంశాలివే..
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు
విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు
ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు
పెండిరగ్ విద్యుత్తు బిల్లులు
విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు. వాటి అప్పుల పంపకాలు
ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు
హైదరాబాద్ లో ఉన్న మూడు భవనాలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే అంశం
లేబర్ సెస్ పంపకాలు
ఉద్యోగుల విభజన అంశాలు
ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ సుహృద్భావపూర్వక వాతావరణంలో జరిగింది. తొలుత ప్రజాభవన్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు రేవంత్, భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. రేవంత్ ఎలా ఉన్నావంటూ చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. కాళోజీ రచించిన ‘నా గొడవ’ పుస్తకాన్ని చంద్రబాబుకు బహూకరించారు. తిరుమల శ్రీవారి ప్రతిమను రేవంత్‌కు చంద్రబాబు బహూకరించారు. కొద్దిసేపు ఇద్దరు నేతలు మాట్లాడుకున్న తర్వాత సమావేశం ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండిరగ్‌లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చించారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్యనేతల సమావేశం వేదికైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. హైదరాబాద్ లో సమావేశమై రెండు సమస్యలను పరిష్కరించుకుందామని, సహకరించుకుంటూ ముందుకు సాగేందుకు ఈ భేటీ ఉపకరిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించడంతో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.