విజయవాడ: ఇటీవల విజయవాడలో వెలుగులోకి వచ్చిన కిడ్నీ రాకెట్ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై మంగళవారం గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సీపీతో ఆమె ఫోన్లో మాట్లాడారు. యువకుడికి డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలని చెప్పారు. హోంమంత్రి ఆదేశాలతో బాధితుడి ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు.
విజయవాడ కేంద్రంగా ఇటీవల కిడ్నీ రాకెట్ ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీ విక్రయానికి అంగీకరిస్తే.. కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేశారని గుంటూరు జిల్లా కొండా వెంకటప్పటయ్యకాలనీకి చెందిన బాధితుడు మధుబాబు వాపోయారు. ఈ మేరకు సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత తాజాగా స్పందించారు.
కిడ్నీ రాకెట్ కేసులో కదలిక
హోంమంత్రి ఆదేశాలతో కిడ్నీ రాకెట్ కేసులో కదలిక వచ్చింది. త్వరిత గతిన కేసును ఛేదించడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తాం గుంటూరు వెస్ట్ డీఎస్పీ మహేష్ తెలిపారు. మోసం చేసి కిడ్నీ తీసుకున్నారని బాధితుడు మధుబాబు నుంచి ఫిర్యాదు అందిందన్నారు. కిడ్నీ మోసానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించాం. పూర్తి వివరాలతో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తాం. దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో కేసును ట్రాన్సఫర్ చేయాలా లేదా అని ఆలోచిస్తాం. ఈ కేసు కు సంబంధించి విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి త్వరలోనే ఈ రాకెట్‌ను ఛేదిస్తామని డీఎస్పీ తెలిపారు.