అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేందుకే జగన్ ఢల్లీి నాటకం ఆడుతున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలను నాగబాబు తప్పుబట్టారు. జగన్ రెడ్డి పాలనలో ప్రజావేదిక కూల్చినప్పుడే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సి ఉండేదని, శాసనసభ సమావేశాలకు రాకుండా ఉండేందుకే నాటకాలు ఆడుతున్నారని నాగబాబు ఎద్దేవా చేశారు. రెండు రోజుల్లో ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టడానికే జగన్ ధర్నా పేరుతో ఢల్లీి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. వినుకొండలో రషీద్ హత్యపై జగన్ శవ రాజకీయాలు చేయటం ఆపాలని హితవు పలికారు. 2019 నుంచి 24 వరకు ఐదేళ్లపాటు వైఎస్సార్సీపీ పాలనలో ప్రజల్ని వేధించారన్నారు.
హత్యలు, దాడులతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారన్నారు. ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు కాకముందే విమర్శలు చేస్తున్నారని నాగబాబు తప్పుబట్టారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత దుర్మార్గ పాలన జగన్ హయాంలో జరిగిందని ఆరోపించారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, డాక్టర్ సుధాకర్‌ను పిచ్చోడిని చేసి రోడ్డుపై కొట్టిన ఘటన, పదో తరగతి విద్యార్థిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఉదంతాలపై జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ప్రజల ఆస్తులు కాజేయాలని చూశారని కానీ జగన్ మరోసారి రాకుండా చేసి ప్రజలు తమని తాము కాపాడుకున్నారని వ్యాఖ్యానించారు.