- వన్యప్రాణుల అక్రమ రవాణాను ఉపేక్షించొద్దు
- ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో వన్య ప్రాణులను వేటాడి, అక్రమ రవాణా చేసేవారిని ఉపేక్షించవద్దని రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులను ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీశాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పల్నాడు జిల్లాలోని విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో వన్య ప్రాణి అలుగు (పంగోలియన్)ను వేటాడి అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకొనే సమయంలో అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేసిన ఘటనపై మంగళవారం ఉదయం పవన్ ఆరా తీశారు. వన్య ప్రాణులకు, అటవీ సంపదకు నష్టం కలిగించినా, అక్రమ రవాణా చేసినా, ఉద్యోగులపై దాడులు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విజయపురి సౌత్ అధికారులపై జరిగిన దాడి ఘటనపై పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగులపై దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ ప్రాంత పరిసరాల్లోని ప్రజలకు అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు.